Friday, September 24, 2010

సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ చందమామ అభిమానం


పసితనంలో చందమామను చూస్తూ ఆమ్మ చేతి గోరుముద్దలు తిన్న రోజులు, చిన్నతనంలొ చందమామ కథలు చదువుతూ హాయిగా గడిచిన అందమైన బాల్యాన్ని ఎవరైనా ఎప్పటికైనా మరువగలరా? నా చందమామ జ్ఞాపకాలను, అక్షర రూపంలొ రాయాలని అనిపించగానే, మనసంతా మధురమైన బాల్యస్మృతులతొ నిండిపోయింది.

నాలుగో తరగతి వేసవి శెలవులకు, మా మావయ్యవాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు, మొట్టమొదటి సారిగా నేను చందమామలో ప్రచురితమైన తోకచుక్క ధారావాహిక బైండింగ్‌ను, మా మావయ్య చేతిలొ చూడడం జరిగింది. వాహ్..ఏమని చెప్పను…! మా మావయ్యని అడిగితే, నిర్మొహమాటంగా ఇవ్వను అని చెప్పి, వాళ్ళపిల్లల కంట కూడ పడకుండా భద్రంగా తన బీరువాలొ జాగ్రత్తగా పెట్టి, ఆఫీసుకి వెళ్లిపొయాడు.అందమైన బైండింగ్‌ల రూపంలో మావయ్య సేకరణలొ వున్న, తోకచుక్క, కంచుకోట, ముగ్గురు మాంత్రికులు, జ్వాలాద్వీపం, మకరదేవత, పాతాళ దుర్గం, రామాయణం, మహాభారతం, దేవిభాగవతం ధారావాహికలన్నీ, నన్ను ఎంతగా ఆకర్షించాయో, మాటలలొ చెప్పలేను.
నేను మా అత్తయ్యను బ్రతిమాలి, మా మావయ్య ఆఫీసుకి వెళ్ళిన వెంటనే,ఒక్కొక్క సీరియల్ని తీసుకొని చదవడం, మా మావయ్య ఆఫీసు నుంచి వచ్చే లోపు, మళ్లీ మా అత్తయ్యకి ఇచ్చేయడం, అలా వేసవి సెలవులు మొత్తం, మా మావయ్య సేకరించిన సీరియల్స్ అన్నీ చదివేయడం జరిగింది.

అసలు వేసవి సెలవులు రెండు నెలలు, ఎలా గడిచిపొయాయో, నాకు అర్ధం కాలేదు. దాసరి సుబ్రమణ్యం గారి అద్భుతమైన కధనంతొ కూడిన, ఆ జానపద సీరియల్స్‌ను చదువుతున్నంతసేపు, చిత్ర, శంకర్ గారి, బొమ్మలను మంత్రముగ్దుడినై చూస్తూ, జానపద లోకంలొ విహరించడం, చందమామతొ నాకున్న ఒక అందమైన జ్ఞాపకం.ఇంక మా వూరికి వచ్చిన తరువాత, చందమామ ఎలా చదవాలి అనుకుంటే, అప్పుడు తెలిసింది, మా వూరి గ్రామీణ గ్రంధాలయంలో వుంటుంది అని. తీరా గ్రంధాలయం వెళ్ళి చూస్తే, చందమామ ఎప్పుడూ ఎవరో ఒకరి చెతిలొ వుండేది. ఇంక లాభం లేదు అనుకొని, గ్రంధాలయం తలుపులు తెరవక ముందే వెళ్ళి, గ్రంధాలయం తలుపులు తెరిచిన వెంటనే లోపలకు వెళ్లి చందమామ పుస్తకాన్ని, విజయ గర్వంతో దక్కించుకున్న రోజులు ఇప్పటికీ ఇంకా నాకు గుర్తు.

సరిగ్గా నేను 7వ తరగతి చదువుతున్నప్పుడు, చందమామలోని, స్వాతంత్ర సమరానికి సంబంధించిన విషయాలన్ని క్రోడీకరించి, మా పాఠశాలలో వకృత్వ పొటీలలొ పాల్గొని, మొదటి బహుమతి గెలుచుకున్న రోజు, మరో అందమైన జ్ఞాపకం.కొన్ని సంవత్సరాల తరువాత, మా మవయ్యను “మావయ్యా! ఇంత పెద్ద వాడివి అయ్యాక కూడ, ఇంకా చందమామని ఎందుకు చదువుతున్నావు ? ఇంకా చందమామని ఎందుకు అంత అపురూపంగా చూసుకుంటున్నావ్?” అని అడిగాను.

చందమామ కథలన్నింటినీ జాగ్ర్తత్తగా, పరిశీలిస్తే,అన్ని కథల నేపధ్యం కూడా, ఆధునిక కాలం కాకుండా పౌరాణిక, జానపద కాలమే. కల్మషం లేని మనుషులు, కథలోనైన ధర్మానిదే గెలుపు, న్యాయానిదే విజయం.రమణీయమైన ప్రకృతి, ముచ్చట గొలుపే జలపాతాలు,సెలయేర్లు, సుందరమైన అడవులు, ఆధునిక పోకడలు లేని, అలనాటి అందమైన కాలపు వర్ణ చిత్రాలను చూస్తూ వుంటే, మనసంతా ఆహ్లాదకరంగా వుంటుంది. చందమామని చదువుతున్నంతసేపు, మళ్ళీ మన కళ్ళ ముందు, మన బాల్యం కదలాడదా,” అని మా మావయ్య సమాధానం ఇచ్చాడు. నిజమే కదా ! అక్షర సత్యమనిపించింది.

తెలుగు బాషపై మంచి పట్టు సాధించడానికి, పురాణ ఇతిహాసాలపై, వివిధ దేశాల జాపపద కథలు, ముఖ్యంగా అరేబియా జానపద గాధలు సుపరిచయం కావడానికి, బేతాళ కథల ద్వారా తార్కిక జ్ఞానాన్ని పెంపొందించడానికి, చక్కని జీవితాన్ని గడపడానికి చందమామ ఎంతగానో, నాకు తోడ్పడింది.అలనాటి చందమామలో, సంపూర్ణ భారత దేశ చరిత్ర, ప్రపంచ వింతలు, వివిధ దేశాల జానపద గాథలు, స్వాతంత్ర సమర ఘట్టాలు, స్వాతంత్ర సమర యెధుల జీవిత విశేషాలు, రామాయణం, మహాభారతం, భాగవతం, పురాణ పురుషులు, పంచతంత్ర కథలు, అద్భుతమైన జానపద సీరియల్స్, వడ్డాది పాపయ్య, చిత్ర, శంకర్ గార్ల వర్ణచిత్రాలు, ఒకటేమిటి… ఆ రోజుల్లొని చందమామ, పిల్లలకే కాదు, పెద్దలకు కూడ ఒక విజ్ఞాన సర్వస్వం.

తెలుగు వారి వారసత్వ సంపద అయిన మహోజ్వల చందమామను, ఈనాడు చూస్తే, అలనాటి పాఠకులకు, మనస్తాపం కలగక మానదు. అర్ధం పర్ధం లేని అనునిర్వ ధారావాహిక, హాస్యాన్ని అపహాస్యం చేయడానికి వేస్తున్న హాస్య కథ. అస్సలు ఆసక్తి కలిగించని 2 కామిక్స్ ధారావాహికలు,4 పేజీల క్రీడా విశేషాలు, పంచతంత్రం, శిథిలాలయం వంటి ధారావాహికలను పునః ప్రచురిస్తున్నా, అలనాటి చిత్రాలవలే కాక, అస్సలు ఆకర్షణీయంగా వుండడం లేదు. అయినా చందమామపై, అభిమానాన్ని చంపుకోలేక,ఇప్పటికీ ప్రతీ నెలా కొంటునేవున్నా.

భారతీయ పత్రికల చరిత్రలోనే, ఎటువంటి లాభాపేక్ష లేకుండా, ప్రారంభ సంచిక నుండి, 2000 సంవత్సరం వరకూ, అన్ని సంచికలను ఆన్‌లైన్‌లో వుంచడం ద్వారా, చందమామ మరోమారు తన ప్రత్యేకతను చాటుకుంది. అన్ని వర్గాల, అన్ని తరాల పాఠకులు మరోసారి తమ బాల్య స్మృతులను, గుర్తు చెసుకునే అవకాశం కలగడం నిజంగా మన అందరి అదృష్టం.ఈ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టిన నేటి చందమామ యాజమాన్యపు నిర్ణయం నిజంగా అభినందనీయం.
చందమామ విషయంలో బాధాకరమైన విషయం ఏమిటి అంటే, చందమామ స్వరయుగపు రోజుల్లో, చందమామను కొని, భద్రపరుచుకొనే స్థితిలొ లేను. చందమామ కొనగలిగే స్థితిలొ వున్న ఈరొజుల్లో, చందమామ ఆ స్థితిలొ లేదు. ఏది ఏమైనా, చిన్నపిల్లల కథలు అనగానే చందమామ కథలు అనే పర్యాయపదం, భారతీయ జనమాధ్యమంలో స్థిరపడేటట్లు చేసిన చందమామ పత్రిక, త్వరలొనే పూర్వ వైభవంతో, దిన దిన ప్రవర్దమానమౌతూ మరింతగా బాలలకు చేరువ కావాలని మనస్పూర్తిగా ఆకాంక్షిస్తున్నాను.

శ్రీనివాస్ కొమ్మిరెడ్డిబెంగళూరుhai.nivas@gmail.కం
= = = = = = = = = = = = = = = = = = = = = = = = = = = = = = = = = = = = = =

చందమామ అసోసీయేటెడ్ సంపాదకులు శ్రీ రాజశేఖర రాజుగారి స్పందన

కొమ్మిరెడ్డి శ్రీనివాస్ గారు బెంగళూరులో ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీలో పని చేస్తూ ఉన్నారు. వయస్సు 34 ఏళ్లు. ఎన్నో రోజులుగా చందమామ జ్ఞాపకాలను రాసి పంపాలి అనుకుంటున్నా, పనుల ఒత్తిడి వల్ల వీలు కాలేదని ఇన్నాళ్లకి వీలు కుదిరిందని మెయిల్ చేశారు. అప్పటికీ, ఇప్పటికీ తనకు తీరని కోరిక ఒక్కటే, చందమామ పత్రిక అచ్చులో తన పేరు చూసుకోవాలని. ఆ కోరిక తీరే విధంగా త్వరలొనే మంచి కథలు రాసి పంపగలనని చెప్పారు. శ్రీనివాస్ గారూ, మీకు కూడా చందమామ తరపున స్వాగతం..!

మీరు పంపిన చందమామ జ్ఞాపకాలు “జానపద లొకంలొ విహరింప చేసే జాబిలమ్మ మా చందమామ” హృద్యంగా ఉంది.. ఆన్‌లైన్ చందమామలో ప్రతి శుక్రవారం మాత్రమే ప్రస్తుతం అప్‌డేషన్ జరుగుతోంది కాబట్టి మీ చందమామ జ్ఞాపకాలను ఈ శుక్రవారం లేదా వచ్చే శుక్రవారం చందమామ వెబ్‌సైట్‌లో, చందమామ బ్లాగులో ప్రచురణకు తీసుకుంటున్నాము.

“చందమామ కథలన్నింటినీ జాగ్ర్తత్తగా, పరిశీలిస్తే, అన్ని కథల నేపధ్యం కూడా, ఆధునిక కాలం కాకుండా పౌరాణిక, జానపద కాలమే. కల్మషం లేని మనుషులు,ఏ కథలోనైనా ధర్మానిదే గెలుపు, న్యాయానిదే విజయం. రమణీయమైన ప్రకృతి, ముచ్చట గొలుపే జలపాతాలు,సెలయేర్లు, సుందరమైన అడవులు, ఆధునిక పోకడలు లేని, అలనాటి అందమైన కాలపు వర్ణ చిత్రాలను చూస్తూ వుంటే, మనసంతా ఆహ్లాదకరంగా వుంటుంది. చందమామని చదువుతున్నంతసేపు, మళ్ళీ మన కళ్ళ ముందు, మన బాల్యం కదలాడదా,” అని మా మావయ్య సమాధానం ఇచ్చాడు.
మీ మామయ్యగారికి శత సహస్ర వందనాలు…

“తెలుగు వారి వారసత్వ సంపద అయిన మహోజ్వల చందమామను, ఈనాడు చూస్తే, అలనాటి పాఠకులకు, మనస్తాపం కలగక మానదు… చందమామ విషయంలో బాధాకరమైన విషయం ఏమిటి అంటే, చందమామ స్వరయుగపు రోజుల్లో, చందమామను కొని, భద్రపరుచుకొనే స్థితిలొ లేను. చందమామ కొనగలిగే స్థితిలొ వున్న ఈరొజుల్లో, చందమామ ఆ స్థితిలొ లేదు…..”

మీ బాధ చందమామ అభిమానులందరి బాధ. పాత చందమామకు, కొత్త చందమామకు ఉన్న హస్తిమశకాంతర వ్యత్యాసంపై మీ అభిప్రాయం ఆలోచించదగినదిగా ఉంది మరోసారి ఈ విషయంపై వివరంగా మీకు మెయిల్ చేస్తాము.
ప్రపంచమంతటా ఉన్న చందమామ అభిమానుల జ్ఞాపకాలను సేకరించి భావితరాల వారికి చందమామ వైభవోజ్యల గతాన్ని, జాతీయ సాంస్కృతిక రాయబారిగా అది చేసిన విశిష్ట సేవను శాశ్వతంగా అందించాలనే ఉద్దేశ్యంతో చందమామ జ్ఞాపకాలు శీర్షికను ప్రారంభించడమైంది.

అలాగే చందమామతో గతంలో, ప్రస్తుతం సంబంధంలో ఉన్న మీ మిత్రులకు, బంధువులకు కూడా చందమామ జ్ఞాపకాల గురించి తెలియజేసి వారి జ్ఞాపకాలను కూడా పంపవలసిందిగా కోరగలరు. ఇది పూర్తిగా చందమామ అభిమానులు, పాఠకులకు ఉద్దేశించిన శీర్షిక కాబట్టి, పరస్పర సమాచార పంపిణీతోనే వారి వారి జ్ఞాపకాలను సేకరించడం సాధ్యమవుతోంది

శ్రీనివాస్ గారూ, చందమామ ఉజ్వల గత, వర్తమానాల పట్ల మీ అభిమానం, ఆవేదనలకు సహానుభూతి ప్రకటిస్తూ.. కోరకుండానే అందమైన చందమామ జ్ఞాపకాలు పంపినందుకు మనఃపూర్వక కృతజ్ఞతలు..చందమామ.
రాజశేఖర్ రాజుగారి చందమామలు బ్లాగు నుండి పున:ప్రచురణ

No comments:

Post a Comment

1. అజ్ఞాత వ్యాఖ్యలు లేదా ప్రొఫైల్ లేకుండా వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు.
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు ప్రచురించబడవు.