Showing posts with label జ్ఞాపకాలు. Show all posts
Showing posts with label జ్ఞాపకాలు. Show all posts

Saturday, January 29, 2011

మా చందమామయ్య


"అవ్వొక రోజులూ" అని మా చిన్న తనంలో పెద్ద వాళ్ళు అంటూ ఉంటే పెద్దగా అర్ధం అయ్యేది కాదు. ఐదుపదులు దాటిన ఇప్పుడు పాత రోజులు తలచుకుంటే, అసంకల్పితంగా అవే మాటలు వస్తున్నాయి.

మా చిన్న తనంలో అంటే 1960, 1970 లలో చందమామ కొనాలంటే మేముండే చోట రెండే షాపులు ఒకటి చెవిటి దుర్గయ్య కొట్టు (పెద్ద డిపార్టుమెంటు స్టోర్ లాంటి కిళ్ళీ కొట్టు) లేదంటే ఆ పక్కనే ఉన్న రెడ్డిగారి కొట్టు. ఆ తరువాత్తరువాత జగ్గారావు షాపు.

చందమామ రావటం ఆలస్యం వారి వారి షాపుల ముందు చందమామలన్ని చక్కగా ఆలంకరించేవాళ్ళు , వడ్డాది పాపయ్య గారి బొమ్మలతో ధగధగా మెరిసిపోతూ చందమామల్తో వాళ్ళ షాపులు వెలిగిపోయేవి. ఒక్క రోజు కంటే ఎక్కువసేపు కాపీలు మిగిలేవి కాదు. అందుకని, మేము వెంటనే ముప్పావలా కోసం ఇంటికి పరుగులు పెట్టి వెంటనే కొత్త కాపీ తీసుకుని బొమ్మలు చూసుకుంటూ ఇంటికి వెళ్ళేవాళ్ళం. కొంత కాలానికి రెడ్డిగారి షాపులో మాకు గుర్తింపు వచ్చింది. మాకోసం ఒక కాపీ ప్రత్యేకంగా ఉంచేవారు. కాబట్టి సాయంత్రం లోపల ఏదో ఒక టైములో చందమామను సంపాయించే అవకాశం చిక్కేది.

అలా పరిచయం అయిన రెడ్డిగారు మా కంటే చాలా పెద్ద వాడైనా మాకు మంచి స్నేహితుడు అయ్యాడు. ఈ మధ్య విజయవాడ వెళ్ళినప్పుడు ఆయన షాపు కనపడలేదు. ఏమయ్యిందో అని ఆరా తీస్తే వయోభారంతో షాపు తీసేసినట్టు తెలిసింది. ఈయన్ని కలుసుకోవటం ఎలా అని ఒకటి రెండు రోజులు అనుకుంటూ ఉండగా ఒకరోజున "మా చందామామయ్య" రెడ్డిగారు రోడ్డుమీదే మాకు తారస పడ్డారు. వెంటనే ఇద్దరం కలిసి ఒక ఫోటో దిగాం.

నా చందమామ జ్ఞాపకాల్లో ఉన్న రెడ్డిగారి తో ఫోటో తీయించుకోవటం ఒక తీపి జ్ఞాపకంగా ఉండిపోతుంది.

Saturday, October 16, 2010

గంధర్వ చక్రవర్తి కూతురు.జ్ఞాపకాల సమీక్ష







ఇది నేను చందమామలు చదవడం మొదలెట్టాక తోకచుక్క, మకర దేవత సీరియల్స్ తరువాత అంతగా నచ్చిన, బాగా గుర్తుండిపోయిన మినీ సీరియల్... అరేబియా కథలు సీరీస్ లో భాగంగా -1981 అక్టోబర్ లో వచ్చిన సీరియల్ ఇది. కథ బస్రా అనే నగరంలో మొదలవుతుంది..అదే అరేబియన్ నేపధ్యం లో నడుస్తుంది.
కధ స్థూలంగా...హసన్ అనే అందమైన ఒక కుర్రవాడు ఆ ఊళ్ళో ఒక చిన్న నగల దుకాణం నడుపుతుంటాడు. ఒక పర్షియన్ మాంత్రికుడు ఆత్మీయత నటించి బంగారం చేసే విద్య నేర్పిస్తాననే నెపంతో దగ్గర చేరుతాడు. ఆ కుర్రవాడు తన తల్లి అత్యాశకు పోవద్దని ఇతను నమ్మదగ్గవాడిలా లేడని ఎంతచెప్పినా వినడు. నమ్మిన హసన్ ను ఆ మాంత్రికుడు మోసగించి క్షుద్రోపాసనలో బలివ్వడానికి తనతో ఒక విచిత్రమైన ద్వీపానికి తీసుకుపోతాడు. తెలివి వచ్చిన హసన్ చాకచక్యంతో ఆ మాంత్రికుడినే మట్టుబెట్టి ఆ దీవిలో ఒంటరిగా తిరుగుతూ ఒక గంధర్వ సామంత రాజు కుమార్తెల వద్ద చేరుతాడు. వారు హసన్ ని తమ్ముని వలె ఆదరిస్తారు.

ఇంతలో అనుకోకుండా మన కథానాయిక ఐన గంధర్వ చక్రవర్తి కూతురిని చూసిన హసన్ మనసు పారేసుకొని ఆమెని కలవలేక చిక్కి శల్యమవుతాడు. పక్షి తొడుగులు ధరించి ఎగురుతూ వచ్చిన ఆ చిన్నదానిని తన అక్క సలహా మీదట ఆ తొడుగు తస్కరించి తన వశం చేసుకుంటాడు. తరువాత ప్రేమతో ఆమె దగ్గర చేరి ఆమె మనసు గెలుచుకొని, ఆమెని పెళ్లి చేసుకొని మళ్ళీ తన ఊరికి చేరుకుంటాడు. అయితే కొంతకాలం గడిచాక తన అక్కలకిచ్చిన మాట మీద వారిని మళ్ళీ చూడడానికి బయలుదేరతాడు. వెళుతూ తన భార్య, పిల్లలను తల్లికి అప్పజెప్పి భార్య యొక్క పక్షి తొడుగుల గురించి చెప్పి అది కంటపడితే తన భార్యకు మళ్ళీ గంధర్వ లోకం వైపు మనసు మళ్ళి తనకు దక్కకుండా పోతుందని...జాగ్రత్త చెప్పి వెళ్తాడు. కానీ అనుకున్నంతా జరిగి ఆమె పిల్లలతో సహా ఎగిరిపోతుంది. అయితే హసన్ ఎంతో సాహసంతో మళ్ళీ ఆ గంధర్వచక్రవర్తి రాజ్యమైన వాక్ - వాక్ దీవులకి చేరుకొని తన భార్యా పిల్లలను ఎలా దక్కించుకోగలిగాడనేది మిగతా కథ.

కథ చాలా మలుపులతో సాగుతుంది. కానీ మన NTR గారి 'జగదేక వీరుని కథ', పాతాళభైరవి టచ్ ఉన్నట్టుంటుంది.. కొంత సారూప్యత వున్నా కథనం, ట్రీట్మెంట్ మాత్రం డిఫరెంట్ గా వుంటుంది. మాంత్రికుడూ, రెక్కల గుర్రాలూ, మంత్రించిన చూర్ణం, పక్షి తొడుగులూ...ఇలా చాలా చిత్రంగా వుంటుంది. ఆసాంతం ఆసక్తిగా చదివిస్తుంది. దీనికి తోడు శంకర్ గారి బొమ్మలు మనకు ఆ సన్నివేశాలని కళ్ళముందు సాక్షాత్కరింప జేస్తాయనడంలో ఎటువంటి సందేహమూ లేదు... అరేబియన్, పర్షియన్ నేపధ్యం.. ఆ పాత్రల ఆహార్యం, రూపకల్పన, సన్నివేశాలకి తగ్గ బాగ్రౌండ్ ని చూపించడంలో 'సరిలేరు నీకెవ్వరూ' అని మరోసారి నిరూపించుకున్నారు.

నేను మూడో క్లాసు చదివేటప్పుడు ఇది సీరియల్ గా వచ్చింది. మొత్తం పది భాగాలు. ఈ కథకి మూలం ఏమిటో ఎవరు రాసారో తెలీదు. కాని టైటిల్ పేజీ కిందమాత్రం ' అరేబియా కథలు' అని వుండేది. మేము ఆ పేజీలను వేరు చేసి పుస్తకం గా కుట్టుకొని వుంచుకున్నాం. చాలా సీరియల్స్ ని ( తోకచుక్క, మకరదేవత, విఘ్నేశ్వరుడు, ఇంకా చాలా..) అలా దాచుకున్నా...ఆ మా తొలినాటి చందమామ జ్ఞాపకంగా చివరకు మిగిలింది ఇది ఒక్కటే (ఈ పుస్తకం లోనే 'ఇద్దరు మోసగత్తెలు' అని ఇంకో సీరియల్ కూడా వుండేది...దానిగురించి ఇంకో టపాలో ముచ్చటిస్తాను). అందుకే ఈ సీరియల్ నాకు ఎంతో ప్రత్యేకం.

ఈ సీరియల్ లింక్ చందమామ ఆర్కైవ్స్ లో మీకోసం...
గంధర్వ చక్రవర్తి కూతురు 1 పేజీ నెం. 61
గంధర్వ చక్రవర్తి కూతురు 2 పేజీ నెం. 60
గంధర్వ చక్రవర్తి కూతురు 3 పేజీ నెం. 61
గంధర్వ చక్రవర్తి కూతురు 4 పేజీ నెం. 59
గంధర్వ చక్రవర్తి కూతురు 5 పేజీ నెం. 59
గంధర్వ చక్రవర్తి కూతురు 6 పేజీ నెం. 59
గంధర్వ చక్రవర్తి కూతురు 7 పేజీ నెం. 59
గంధర్వ చక్రవర్తి కూతురు 8 పేజీ నెం. 59
గంధర్వ చక్రవర్తి కూతురు 9 పేజీ నెం. 59
గంధర్వ చక్రవర్తి కూతురు 10 పేజీ నెం. ౬౧

జ్ఞాపకాల ద్వారా సమీక్ష ఒక చక్కటి ప్రయోగం. బ్లాగు నుండి చదువుకోవటానికి వీలుగా లింకులు ఇవ్వటం మరొక మంచి విధానం. ఈ వ్యాసాన్ని పంపినవారు శ్రీ రుద్రావజ్ఝుల రాదే మాధవి గారు, విశాఖపట్టణం నుంచి. ఆయన మరిన్ని ఇటువంటి మంచి వ్యాసాలూ పంపాలని ఆకాంక్షిస్తున్నాము.

Friday, September 24, 2010

సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ చందమామ అభిమానం


పసితనంలో చందమామను చూస్తూ ఆమ్మ చేతి గోరుముద్దలు తిన్న రోజులు, చిన్నతనంలొ చందమామ కథలు చదువుతూ హాయిగా గడిచిన అందమైన బాల్యాన్ని ఎవరైనా ఎప్పటికైనా మరువగలరా? నా చందమామ జ్ఞాపకాలను, అక్షర రూపంలొ రాయాలని అనిపించగానే, మనసంతా మధురమైన బాల్యస్మృతులతొ నిండిపోయింది.

నాలుగో తరగతి వేసవి శెలవులకు, మా మావయ్యవాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు, మొట్టమొదటి సారిగా నేను చందమామలో ప్రచురితమైన తోకచుక్క ధారావాహిక బైండింగ్‌ను, మా మావయ్య చేతిలొ చూడడం జరిగింది. వాహ్..ఏమని చెప్పను…! మా మావయ్యని అడిగితే, నిర్మొహమాటంగా ఇవ్వను అని చెప్పి, వాళ్ళపిల్లల కంట కూడ పడకుండా భద్రంగా తన బీరువాలొ జాగ్రత్తగా పెట్టి, ఆఫీసుకి వెళ్లిపొయాడు.అందమైన బైండింగ్‌ల రూపంలో మావయ్య సేకరణలొ వున్న, తోకచుక్క, కంచుకోట, ముగ్గురు మాంత్రికులు, జ్వాలాద్వీపం, మకరదేవత, పాతాళ దుర్గం, రామాయణం, మహాభారతం, దేవిభాగవతం ధారావాహికలన్నీ, నన్ను ఎంతగా ఆకర్షించాయో, మాటలలొ చెప్పలేను.
నేను మా అత్తయ్యను బ్రతిమాలి, మా మావయ్య ఆఫీసుకి వెళ్ళిన వెంటనే,ఒక్కొక్క సీరియల్ని తీసుకొని చదవడం, మా మావయ్య ఆఫీసు నుంచి వచ్చే లోపు, మళ్లీ మా అత్తయ్యకి ఇచ్చేయడం, అలా వేసవి సెలవులు మొత్తం, మా మావయ్య సేకరించిన సీరియల్స్ అన్నీ చదివేయడం జరిగింది.

అసలు వేసవి సెలవులు రెండు నెలలు, ఎలా గడిచిపొయాయో, నాకు అర్ధం కాలేదు. దాసరి సుబ్రమణ్యం గారి అద్భుతమైన కధనంతొ కూడిన, ఆ జానపద సీరియల్స్‌ను చదువుతున్నంతసేపు, చిత్ర, శంకర్ గారి, బొమ్మలను మంత్రముగ్దుడినై చూస్తూ, జానపద లోకంలొ విహరించడం, చందమామతొ నాకున్న ఒక అందమైన జ్ఞాపకం.ఇంక మా వూరికి వచ్చిన తరువాత, చందమామ ఎలా చదవాలి అనుకుంటే, అప్పుడు తెలిసింది, మా వూరి గ్రామీణ గ్రంధాలయంలో వుంటుంది అని. తీరా గ్రంధాలయం వెళ్ళి చూస్తే, చందమామ ఎప్పుడూ ఎవరో ఒకరి చెతిలొ వుండేది. ఇంక లాభం లేదు అనుకొని, గ్రంధాలయం తలుపులు తెరవక ముందే వెళ్ళి, గ్రంధాలయం తలుపులు తెరిచిన వెంటనే లోపలకు వెళ్లి చందమామ పుస్తకాన్ని, విజయ గర్వంతో దక్కించుకున్న రోజులు ఇప్పటికీ ఇంకా నాకు గుర్తు.

సరిగ్గా నేను 7వ తరగతి చదువుతున్నప్పుడు, చందమామలోని, స్వాతంత్ర సమరానికి సంబంధించిన విషయాలన్ని క్రోడీకరించి, మా పాఠశాలలో వకృత్వ పొటీలలొ పాల్గొని, మొదటి బహుమతి గెలుచుకున్న రోజు, మరో అందమైన జ్ఞాపకం.కొన్ని సంవత్సరాల తరువాత, మా మవయ్యను “మావయ్యా! ఇంత పెద్ద వాడివి అయ్యాక కూడ, ఇంకా చందమామని ఎందుకు చదువుతున్నావు ? ఇంకా చందమామని ఎందుకు అంత అపురూపంగా చూసుకుంటున్నావ్?” అని అడిగాను.

“చందమామ కథలన్నింటినీ జాగ్ర్తత్తగా, పరిశీలిస్తే,అన్ని కథల నేపధ్యం కూడా, ఆధునిక కాలం కాకుండా పౌరాణిక, జానపద కాలమే. కల్మషం లేని మనుషులు,ఏ కథలోనైన ధర్మానిదే గెలుపు, న్యాయానిదే విజయం.రమణీయమైన ప్రకృతి, ముచ్చట గొలుపే జలపాతాలు,సెలయేర్లు, సుందరమైన అడవులు, ఆధునిక పోకడలు లేని, అలనాటి అందమైన కాలపు వర్ణ చిత్రాలను చూస్తూ వుంటే, మనసంతా ఆహ్లాదకరంగా వుంటుంది. చందమామని చదువుతున్నంతసేపు, మళ్ళీ మన కళ్ళ ముందు, మన బాల్యం కదలాడదా,” అని మా మావయ్య సమాధానం ఇచ్చాడు. నిజమే కదా ! అక్షర సత్యమనిపించింది.

తెలుగు బాషపై మంచి పట్టు సాధించడానికి, పురాణ ఇతిహాసాలపై, వివిధ దేశాల జాపపద కథలు, ముఖ్యంగా అరేబియా జానపద గాధలు సుపరిచయం కావడానికి, బేతాళ కథల ద్వారా తార్కిక జ్ఞానాన్ని పెంపొందించడానికి, చక్కని జీవితాన్ని గడపడానికి చందమామ ఎంతగానో, నాకు తోడ్పడింది.అలనాటి చందమామలో, సంపూర్ణ భారత దేశ చరిత్ర, ప్రపంచ వింతలు, వివిధ దేశాల జానపద గాథలు, స్వాతంత్ర సమర ఘట్టాలు, స్వాతంత్ర సమర యెధుల జీవిత విశేషాలు, రామాయణం, మహాభారతం, భాగవతం, పురాణ పురుషులు, పంచతంత్ర కథలు, అద్భుతమైన జానపద సీరియల్స్, వడ్డాది పాపయ్య, చిత్ర, శంకర్ గార్ల వర్ణచిత్రాలు, ఒకటేమిటి… ఆ రోజుల్లొని చందమామ, పిల్లలకే కాదు, పెద్దలకు కూడ ఒక విజ్ఞాన సర్వస్వం.

తెలుగు వారి వారసత్వ సంపద అయిన మహోజ్వల చందమామను, ఈనాడు చూస్తే, అలనాటి పాఠకులకు, మనస్తాపం కలగక మానదు. అర్ధం పర్ధం లేని అనునిర్వ ధారావాహిక, హాస్యాన్ని అపహాస్యం చేయడానికి వేస్తున్న హాస్య కథ. అస్సలు ఆసక్తి కలిగించని 2 కామిక్స్ ధారావాహికలు,4 పేజీల క్రీడా విశేషాలు, పంచతంత్రం, శిథిలాలయం వంటి ధారావాహికలను పునః ప్రచురిస్తున్నా, అలనాటి చిత్రాలవలే కాక, అస్సలు ఆకర్షణీయంగా వుండడం లేదు. అయినా చందమామపై, అభిమానాన్ని చంపుకోలేక,ఇప్పటికీ ప్రతీ నెలా కొంటునేవున్నా.

భారతీయ పత్రికల చరిత్రలోనే, ఎటువంటి లాభాపేక్ష లేకుండా, ప్రారంభ సంచిక నుండి, 2000 సంవత్సరం వరకూ, అన్ని సంచికలను ఆన్‌లైన్‌లో వుంచడం ద్వారా, చందమామ మరోమారు తన ప్రత్యేకతను చాటుకుంది. అన్ని వర్గాల, అన్ని తరాల పాఠకులు మరోసారి తమ బాల్య స్మృతులను, గుర్తు చెసుకునే అవకాశం కలగడం నిజంగా మన అందరి అదృష్టం.ఈ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టిన నేటి చందమామ యాజమాన్యపు నిర్ణయం నిజంగా అభినందనీయం.
చందమామ విషయంలో బాధాకరమైన విషయం ఏమిటి అంటే, చందమామ స్వరయుగపు రోజుల్లో, చందమామను కొని, భద్రపరుచుకొనే స్థితిలొ లేను. చందమామ కొనగలిగే స్థితిలొ వున్న ఈరొజుల్లో, చందమామ ఆ స్థితిలొ లేదు. ఏది ఏమైనా, చిన్నపిల్లల కథలు అనగానే చందమామ కథలు అనే పర్యాయపదం, భారతీయ జనమాధ్యమంలో స్థిరపడేటట్లు చేసిన చందమామ పత్రిక, త్వరలొనే పూర్వ వైభవంతో, దిన దిన ప్రవర్దమానమౌతూ మరింతగా బాలలకు చేరువ కావాలని మనస్పూర్తిగా ఆకాంక్షిస్తున్నాను.

శ్రీనివాస్ కొమ్మిరెడ్డిబెంగళూరుhai.nivas@gmail.కం
= = = = = = = = = = = = = = = = = = = = = = = = = = = = = = = = = = = = = =

చందమామ అసోసీయేటెడ్ సంపాదకులు శ్రీ రాజశేఖర రాజుగారి స్పందన

కొమ్మిరెడ్డి శ్రీనివాస్ గారు బెంగళూరులో ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీలో పని చేస్తూ ఉన్నారు. వయస్సు 34 ఏళ్లు. ఎన్నో రోజులుగా చందమామ జ్ఞాపకాలను రాసి పంపాలి అనుకుంటున్నా, పనుల ఒత్తిడి వల్ల వీలు కాలేదని ఇన్నాళ్లకి వీలు కుదిరిందని మెయిల్ చేశారు. అప్పటికీ, ఇప్పటికీ తనకు తీరని కోరిక ఒక్కటే, చందమామ పత్రిక అచ్చులో తన పేరు చూసుకోవాలని. ఆ కోరిక తీరే విధంగా త్వరలొనే మంచి కథలు రాసి పంపగలనని చెప్పారు. శ్రీనివాస్ గారూ, మీకు కూడా చందమామ తరపున స్వాగతం..!

మీరు పంపిన చందమామ జ్ఞాపకాలు “జానపద లొకంలొ విహరింప చేసే జాబిలమ్మ మా చందమామ” హృద్యంగా ఉంది.. ఆన్‌లైన్ చందమామలో ప్రతి శుక్రవారం మాత్రమే ప్రస్తుతం అప్‌డేషన్ జరుగుతోంది కాబట్టి మీ చందమామ జ్ఞాపకాలను ఈ శుక్రవారం లేదా వచ్చే శుక్రవారం చందమామ వెబ్‌సైట్‌లో, చందమామ బ్లాగులో ప్రచురణకు తీసుకుంటున్నాము.

“చందమామ కథలన్నింటినీ జాగ్ర్తత్తగా, పరిశీలిస్తే, అన్ని కథల నేపధ్యం కూడా, ఆధునిక కాలం కాకుండా పౌరాణిక, జానపద కాలమే. కల్మషం లేని మనుషులు,ఏ కథలోనైనా ధర్మానిదే గెలుపు, న్యాయానిదే విజయం. రమణీయమైన ప్రకృతి, ముచ్చట గొలుపే జలపాతాలు,సెలయేర్లు, సుందరమైన అడవులు, ఆధునిక పోకడలు లేని, అలనాటి అందమైన కాలపు వర్ణ చిత్రాలను చూస్తూ వుంటే, మనసంతా ఆహ్లాదకరంగా వుంటుంది. చందమామని చదువుతున్నంతసేపు, మళ్ళీ మన కళ్ళ ముందు, మన బాల్యం కదలాడదా,” అని మా మావయ్య సమాధానం ఇచ్చాడు.
మీ మామయ్యగారికి శత సహస్ర వందనాలు…

“తెలుగు వారి వారసత్వ సంపద అయిన మహోజ్వల చందమామను, ఈనాడు చూస్తే, అలనాటి పాఠకులకు, మనస్తాపం కలగక మానదు… చందమామ విషయంలో బాధాకరమైన విషయం ఏమిటి అంటే, చందమామ స్వరయుగపు రోజుల్లో, చందమామను కొని, భద్రపరుచుకొనే స్థితిలొ లేను. చందమామ కొనగలిగే స్థితిలొ వున్న ఈరొజుల్లో, చందమామ ఆ స్థితిలొ లేదు…..”

మీ బాధ చందమామ అభిమానులందరి బాధ. పాత చందమామకు, కొత్త చందమామకు ఉన్న హస్తిమశకాంతర వ్యత్యాసంపై మీ అభిప్రాయం ఆలోచించదగినదిగా ఉంది మరోసారి ఈ విషయంపై వివరంగా మీకు మెయిల్ చేస్తాము.
ప్రపంచమంతటా ఉన్న చందమామ అభిమానుల జ్ఞాపకాలను సేకరించి భావితరాల వారికి చందమామ వైభవోజ్యల గతాన్ని, జాతీయ సాంస్కృతిక రాయబారిగా అది చేసిన విశిష్ట సేవను శాశ్వతంగా అందించాలనే ఉద్దేశ్యంతో చందమామ జ్ఞాపకాలు శీర్షికను ప్రారంభించడమైంది.

అలాగే చందమామతో గతంలో, ప్రస్తుతం సంబంధంలో ఉన్న మీ మిత్రులకు, బంధువులకు కూడా చందమామ జ్ఞాపకాల గురించి తెలియజేసి వారి జ్ఞాపకాలను కూడా పంపవలసిందిగా కోరగలరు. ఇది పూర్తిగా చందమామ అభిమానులు, పాఠకులకు ఉద్దేశించిన శీర్షిక కాబట్టి, పరస్పర సమాచార పంపిణీతోనే వారి వారి జ్ఞాపకాలను సేకరించడం సాధ్యమవుతోంది

శ్రీనివాస్ గారూ, చందమామ ఉజ్వల గత, వర్తమానాల పట్ల మీ అభిమానం, ఆవేదనలకు సహానుభూతి ప్రకటిస్తూ.. కోరకుండానే అందమైన చందమామ జ్ఞాపకాలు పంపినందుకు మనఃపూర్వక కృతజ్ఞతలు..చందమామ.
రాజశేఖర్ రాజుగారి చందమామలు బ్లాగు నుండి పున:ప్రచురణ