Showing posts with label చందమామ రచయితలు. Show all posts
Showing posts with label చందమామ రచయితలు. Show all posts

Tuesday, March 15, 2011

తొలి చందమామ అపరూప కథకులు శ్రీ అవసరాల

అవసరాల రామకృష్ణారావు గారు

శ్రీ అవసరాల రామకృష్ణారావుగారి గురించీ మళ్ళీ పరిచయం చేయనవసరం లేదు. భారతీయ సాంస్కృతిక రాయబారిగా అభిమానులు ప్రేమగా పిలుచుకునే చందమామ పత్రిక తొలి సంచికలో కథ రాసిన మాన్యులు. 1947లో కేవలం పదహారేళ్ల వయస్సులో “పొట్టి పిచిక కథ” అనే కథను రాసి పంపారు. అమ్మ చెప్పిన కథను, అందరికీ తెలిసిన కథను తనదైన శైలిలో, ఊకొడితే సాగే శైలిలో కుతూహలం కొద్దీ చిన్న వయసులో కాగితంపై పెట్టి పంపితే తెలుగు పిల్లల అందాల మాసపత్రిక ‘చందమామ’ దాన్ని అలాగే తొలిసంచికలో వేసుకుంది.

ఆ క్షణం.. గత 64 ఏళ్లుగా కొనసాగుతున్న ఆయన సాహితీ ప్రస్థానానికి తొలి బీజం వేసిన క్షణం. బాల్యంలో తొంగి చూసిన ఆ తొలి కిరణపు రూపురేఖలే నేటి ఈ వృధ్దాప్యంలో -80 ఏళ్లు- కూడా కొనసాగడం ఆయనకు ఆశ్చర్యం, ఆనందం వేస్తూంటుంది.

ఓ బడుగుజీవి -పిచ్చిక- తను కష్టపడి సాధించుకున్నది అది చాలా కొంచెమే కావచ్చు పోగొట్టుకుంటుంది. ఎంతమందినో కలుసుకుని ఎవరూ కలిసి రాకపోయినా పట్టుదల వదలక, చివరికి విజయం సాధిస్తుంది. ఇదీ ఆనాడు తొలి చందమామలో అవసరాల గారు రాసిన ‘పొట్టిపిచిక కథ’. ఇదే తదనందర జీవితంలో తన విజయ సూత్రం అవుతుందని తను ఆనాడనుకోలేదట.

వెయ్యికి పైగా రచనలు చేసి 80 ఏళ్ల వయస్సులోనూ తలవంచక, కలం దించక తెలుగు కథకుడిగా కొనసాగుతున్న తనకు, దారి చూపే వేగుచుక్క తొలి చందమామలో అచ్చయిన ఆ తొలి కథే అని వినమ్ర ప్రకటన చేశారీయన. పక్షులతో, జంతువులతో మనుషుల్ని కలిపి సామాజికాంశాల్ని సరళంగా చెప్పవచ్చునని తాను నేర్చుకున్నది ‘చందమామ’ పత్రిక చలవవల్లనే అని హృదయం నిండా కృతజ్ఞతలు ప్రదర్శించారు.

రచన శాయి, దాసరి వెంకటరమణ గార్ల పుణ్యమా అని ఈ తొలి చందమామ కథకుడి గురించి వినడం, కనడం, మాట్లాడడం గత నెలరోజులలోగా జరిగిపోయింది. జనవరి 27న హైదరాబాదులో దాసరి సుబ్రహ్మణ్యంగారి ప్రధమ వర్థంతి సందర్భంగా ఆయన చందమామేతర సీరియల్స్ ఆవిష్కరణ సందర్భంగా సిటీసెంట్రల్ లైబ్రరీ సమావేశమందిరంలో కలుసుకున్నప్పుడు మా అందరి ముందూ ఒక మెరుపు మెరిసినట్లయింది వందమంది దాకా చందమామ అభిమానులు, వీరాభిమానులు, చందమామ రచయితలు, పాఠకులు ఒక చోట చేరిన ఆ అరుదైన సన్నివేశంలో ఆయన 80 ఏళ్ల వయస్సులో కూడా ఎంత చలాకీగా కనిపించారో..

సైజుతో పాటు చురుకుతనంలో కూడా నాటి పొట్టి పిచిక లక్షణాలు ఇప్పటికీ మిగిలి ఉన్నాయని ఈయన తనమీద తను సోకైన జోక్ వేసుకుంటారట. అక్షరాలా నిజం. ఆయన రూపాన్ని చూసినా, ఫోన్‌లో మాట్లాడినా గలగలగలమనే పిచ్చిక కువకువలనే తలపించే మూర్తిమత్వం.

ఆ సమావేశంలో కుదురుగా మాట్లాడటం సాధ్యం కాకపోయినా తర్వాత శాయిగారు ఆయనతో మాట్లాడించినప్పుడు నాలో ఒక్కటే ఆలోచన. మన కళ్లముందు మిగిలి ఉన్న ఈ తొలి చందమామ అపురూప కథకుడి చందమామ జ్ఞాపకాలు ఎలాగైనా సంపాదిస్తే ఎంతబాగుంటుంది! ఆయన రాయగలరా, రాసి పంపగలరా, వయస్సు సహకరించగలదా.. ఆయనతో మాట్లాడాక ఆ గలగలల శబ్దం ముందు ఈ ‘గలదా’లన్నీ పక్కకు పోయాయి.

చందమామకు కథల పిచ్చికలు:
ఆయన విశాఖపట్నం వెళ్లాక రెండు రోజుల్లోగా తన చందమామ జ్ఞాపకాలు, బోనస్‌గా చిట్టి కథ కూడా రాసి శాయిగారికి పంపడం, ఆయన వాటిని స్కాన్ చేసి వెంటనే చందమామకు ఈ మెయిల్ చేయడం నిజంగా అదొక మధురానుభూతి. ఇలా ఈమెయిల్ చేశాక శాయిగారు, ఆయనతో మాట్లాడుతూ మీరు పంపిన జ్ఞాపకాల, కథల పిచ్చికలు చందమామ వైపు ఇప్పుడే ఎగిరిపోయాయని చెప్పిన్పప్పుడు చాలా సంతోషం వేసిందని ఈరోజు ఈ తొలి చందమామ కథకుడు సంబరపడుతూ చెప్పడం మర్చిపోలేని అనుభూతి.

1947 జూలైలోనే తొలి చందమామ అచ్చయింది కనుక దీన్ని పునస్కరించుకుని 2011 జూలై నెలలో ఈ మాన్యుడి పాత కథ -పొట్టిపిచిక కథ-, చందమామ జ్ఞాపకాలు, బోనస్‌గా అందించిన మరో చిన్న కథ -విజయమాల-లను ఒకేసారి ప్రచురిస్తే బాగుంటుందన్న శాయిగారి ప్రతిపాదనను మా పైవారికి చెప్పడం. వెంటనే అది ఆమోదించబడటం జరిగిపోయింది.

ఆయన ఫోన్‌లో మాట్లాడుతూ, తెలుగు భాషపై పిచ్చి అభిమానంతో, తాను ఇతర ప్రాంతీయ భాషలను నేర్చుకోలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. చందమామతో తన సంబంధం మొదటి దశకే పరిమితమని తర్వాత వృత్తి రీత్యా ఇంగ్లీష్ లెక్చరర్‌గా, రీడర్‌గా ఒరిస్సాలో దశాబ్దాలు పనిచేసి రిటైరయ్యాయనని, ఆ ప్రభుత్వం, ఆ ప్రజల ఉప్పుతిని, ఇప్పటికీ వారి ఫించను తింటూ, వారి భాషను నేర్చుకోకపోవడం కంటే మించిన పోగాలం -పొయ్యేకాలం- మరొకటి లేదని ఆయన నొక్కి చెప్పారు.

బహుభాషల నిలయమైన మన దేశంలో అంతర్జాతీయ భాషకు ఇస్తున్న ప్రాధాన్యంలో ఒక శాతం కూడా మన ఇరుగు పొరుగు రాష్ట్ర్ల్లాల భాషలకు ఇవ్వలేకపోతున్నామని ఆయన ఇప్పుడు బాధపడుతున్నారు.

ఒరియా ఎలాగూ నేర్చుకోలేకపోయాను. సంస్కృతాన్నయినా పట్టుకుందాం… అని గతంలోనే ఈయన ప్రయత్నించారట. కాని సంస్కృతం పుస్తకం తెరిచి పట్టుకుంటే దాంట్లోనూ తనను తెలుగుపదమే వెంటాడేదని, దాంతో సంస్కృతాన్ని కూడా పక్కన పెట్టేశానని చెప్పారు. మూడు దశాబ్దాలకు పైగా ఒరిస్సాలో ఉండి కూడా చాకలివారితో పనిబడినప్పుడు, అంగడి అవసరాలకు మాత్రమే చిన్న చిన్న ఒరియా పదాలను ఉపయోగించేవాడిని తప్ప ఆ భాష మూలంలోకి వెళ్లలేకపోయానని నిజంగా ఇది పోగాలమేనని చెప్పారాయన.

పోగాలం అనే పదం తెలుగులో వాడితే దాన్ని ఇతర భాషలవారు చస్తే అర్థం చేసుకోలేరని, అనువదించలేరని, నామవాచకానికి బదులు నాలుగైదు పదాలలో వివరిస్తేగాని ఈ పదం ఇతరులకు అర్థంకాదని, ఇది మన అన్య భాషా దారిద్ర్యమేనని ఆయన తేల్చి చెప్పారు. మన పొరుగున ఉన్న భాషను మనం నేర్చుకోలేకపోతున్నామంటే అది పొరుగు భాష పట్ల మనకున్న చిన్నచూపే కారణమని. ప్రయత్నించీ నేర్చుకోలేకపోతున్నానని, ఇలా మిగతా ఎన్ని సాకులు చెప్పినా, పొరుగు భాషపట్ల కించభావమే ప్రధానమని. ఆయన తేల్చేశారు.

వృత్తి జీవితమంతా ఇంగ్లీష్ టీచింగే అయినప్పటికీ తెలుగు అంటే విపరీత వ్యామోహంతోనే గత 64 ఏళ్ల కాలంలో వెయ్యిరచనలు తెలుగులోనే చేయగలిగానని, మన రచనలు ఇంగ్లీషుతో సహా ఇతర భాషలలోకి అనువదించుకోలేకపోవటానికి కూడా శక్తి లేకపోవడం కాకుండా మన భాషా దురభిమానమే కారణమవుతోందని ఆయన గట్టి అభిప్రాయం. ఇది పనికిరాదని, ఇలాంటి పిచ్చి అభిమానం మనకే మేలూ చేయదని అంటారు.

చందమామలో తప్పిన అవకాశం:
అప్పట్లోనే కొడవటిగంటి కుటుంబరావు గారు తనకు ఉత్తరం రాస్తూ ‘మీరు ఒరిస్సాలో ఉన్నారు కనుక ఒరియా చందమామను సరిదిద్దే పని చేపట్టవచ్చు’ కదా అని అవసరాల గారిని అడిగారట. జీవితంలో అది ఎంత మహత్తరమైన ప్రతిపాదనో -ఆఫర్- మీకు తెలిసే ఉంటుందని, కాని ఆ ఆఫర్ అందుకోవాలంటే అర్హత ఉండాలని, ఒరియాలో అక్షరమ్ముక్క రాయలేని, చదవలేని నాకు ఎలా అది సాధ్యపడుతుందని ఆయన చెబుతోంటే కంఠంలో జీర.

కుటుంబరావు గారు కూడా 30 ఏళ్లు చెన్నయ్‌లో ఉంటూ కూడా తమిళంలో అక్షరం ముక్క మాట్లాడేవారు కారని, దాసరి సుబ్రహ్మణ్యం గారు 54 ఏళ్లు చెన్నయ్‌లో చందమామ పనిలో ఉండి కూడా తమిళం నే్ర్చుకోలేకపోయారని నాకు తెలిసిన సమాచారం చెబితే. నిజంగా ఇది మనభాషపై ఉన్న మక్కువ ప్రభావమేనని కానీ ఇలాంటి వైఖరి, స్వంత భాషపట్ల మాత్రమే అభిమానం, మనకు చాలా నష్టకరంగా మారుతుందని, ఏ రకంగా చూసినా మన భాషకే కట్టుబడిపోవడం సరైంది కాదని అన్నారు.

1996 నుంచి నేనూ చెన్నయ్‌లో ఉంటున్నప్పటికీ, ఏంగా, పోంగా, వాంగా అనే మార్కెట్ లాంగ్వేజ్ తప్ప తమిళం కుదురుగా మాట్లాడటం, రాయడం, చదవడం తెలియదని నేనూ సిగ్గుపడుతూ చెబితే నవ్వారాయన. మనందరికీ ఒకే పోగాలమేనని ఆయన భావన. ఒక రాష్ట్రంలో ఉంటూ కూడా వారి తిండి తింటూ కూడా వారి భాషను నేర్చుకోలేకపోవడం జాతీయ దౌర్భాగ్యమని ఈయన అభిప్రాయం.

వారం రోజుల క్రితం నేను ఫోన్ చేసి మాట్లాడుతుంటే నా మాట్లలో ‘ఖచ్చితంగా’ అనే ఊతపదాన్ని ఆయన భలేపట్టేశారు. ఖచ్చితంగా చేద్దాం, చూద్దాం, ప్రయత్నిద్దాం అనే రూపాల్లో ఆ పదాన్ని వాడుతుంటే ఆయనకు ఎందుకో గాని తెగనచ్చేసింది. ఇందులో తెలుగు పదం విభిన్న రూపాల్లో అంత స్వచ్చంగా వాడటమే ఆయన దృష్టిలో పడినట్లుంది.

చివరగా, చందమామతో తన ముచ్చట్లు చాలా పాతకాలానికి మాత్రమే పరిమితమయ్యాయని వృత్తి జీవితంలో, రచనా వ్యాపకంలో కూడా అంతర్ముఖత్వంతో గడపడం వల్ల తనకు ఎవరితోనూ పెద్దగా పరిచయాలు లేవని చెప్పారాయన. పాతకాలం రచయితలంతా ఇలాంటి అంతర్ముఖత్వంతో కూడిన ప్రపంచంలోనే గడిపేశారని పదిమంది నోళ్లల్లో నానాలనే లేశమాత్రపు కోరిక కూడా పాతతరానికి లేదని చెబుతూ కొన్ని వివరాలు తనతో పంచుకున్నాను.

ఆరోగ్యం బాగే కదా అని అడిగితే, రాయడమే ఆరోగ్యం, మనసుకు పనిపెట్టడమే ఆరోగ్యం అన్నారు. ఇప్పటికీ నిరంతరం రాస్తూన్నాను కనుకే ఆరోగ్యం తన కట్టుబాటులో ఉందని చెప్పారు.

చివరకు చందమామ జ్ఞాపకాలను చాలా త్వరగా ముగించినట్లుంది, ఇంకొంచెం వివరంగా రాసి ఉంటే బాగుండేదేమో అని అడిగితే ఇంతకు మించి రాస్తే డబ్బా కొట్టుకున్నట్లే, 60 ఏళ్ల క్రితం నాటి విషయాలు ఎన్ని పుటల్లో చెప్పాలి అంటూ ముగించారు. కందపద్యం అంటే తనకు చాలా ఇష్టం అయినా నాలుగు పాదాలకు బదులు రెండు పాదాలే రాసి చదువుకుని సంతోషించేవారట.

మీరిలాగే ఓపిగ్గా, ఆరోగ్యంగా ఉంటూ చందమామకు కూడా కథలు పంపుతూ ఉండండి అంటే రాస్తుండటమే పెద్ద ఓపిక, పెద్ద ఆరోగ్యం అని నవ్వేశారు. రాయకుంటే అనారోగ్యమేనట.గతంలో రాసిన పుస్తకం పంపుతానని, అంగ్రేజీ యమఈజీ పుస్తకం కూడా త్వరలో రానుందని చెప్పారు.

గడచిన తరాల నిరాడంబరత్వానికి, నమ్రతకు ప్రతిరూపంగా కనిపించే మన చందమామ అలనాటి కథకుడివద్ద, మళ్లీ కలుద్దామంటూ సెలవు తీసుకున్నాను.

అవసరాల రామకృష్ణారావుగారి పాత కథ, కొత్త కథ, చందమామ జ్ఞాపకాల పూర్తిపాఠం కోసం జూలై నెల ప్రింట్ చందమామ వచ్చేంతవరకూ ఆగాల్సిందే…!

తొలి చందమామ కథకుడితో పరిచయ భాగ్యం కల్గించిన రచన శాయి, దాసరి రమణగార్లకు కృతజ్ఞతాభివందనలు.


=======================================================

ఈ వ్యాసం ఇంతకు ముందు శ్రీ రాజశేఖర రాజుగారు తన బ్లాగు "చందమామలు" లోప్రచురించారు. ఇక్కడ పున:ప్రచురణ

=================================================



Monday, January 24, 2011

‘చందమామ’ను దాటి ‘బొమ్మరిల్లు’ను మీటి...!

అన్వర్, చంద్రల గీతల్లో దా.సు.గారు
‘ఇండియా టుడే’ పత్రిక ఆయన్ని ‘జానపద కథా వైశంపాయను’డని కీర్తించింది!

అపూర్వమూ, మౌలికమూ అయిన జానపద కథల స్వర్గాన్ని సృష్టించినందుకు ‘విశ్వామిత్రు’డితోనూ పోల్చొచ్చు. జానపద కథా సరిత్సాగరాన్ని ‘అగస్త్యు’డిలా ఆపోశన పట్టాడంటూ అభివర్ణించవచ్చేమో కానీ, అద్భుతమైన రచనలు చేసి కూడా ఆయన తెరమరుగునే ఉండిపోయారు ... ‘అగస్త్య భ్రాత’లా!

బతికుండగా ఆ పేరు పాఠకులకు పెద్దగా తెలియలేదు. చనిపోయాకే ఆయన రచనల విస్తృతి పాఠక లోకానికి వెల్లడవుతోంది...

ఔను... ఇదంతా ‘జానపద నవలా సమ్రాట్’ దాసరి సుబ్రహ్మణ్యం గారి సంగతే!



ఆ అక్షరాల వెలుగులు ‘చందమామ’ పత్రికకు మాత్రమే పరిమితం కాలేదు. ఆ కలం ఇంద్రజాలం ఇతర పత్రికల పాఠకులనూ విశేషంగా సమ్మోహనపరిచింది. బొమ్మరిల్లు, ప్రమోద, జాబిల్లి, స్నేహబాల, మిలియన్ జోక్స్... ఈ పత్రికల్లో వెలువడిన జానపద ధారావాహికల స్రష్ట కూడా ఆయనే!

‘చందమామ’లో దా.సు. సృష్టించిన ‘తోకచుక్క’ నుంచి ‘భల్లూక మాంత్రికుడు’ వరకూ పన్నెండు సీరియల్స్ చి ఇప్పుడు చాలామందికి తెలుసు.

తెలియనిదల్లా పేరు లేకుండా ఇతర పత్రికల్లో ఆయన రాసిన వాటి గురించే!

అసలే అజ్ఞాత రచయిత... పైగా ప్రచ్ఛన్న రచనలు! ఒక్కో రహస్యమే బయటపడుతూ ఆ రచనా విశ్వరూపం... ఇప్పుడు - క్రమంగా గోచరమవుతోంది!

ఇదంతా ఇప్పటికైనా వెల్లడవుతున్నందుకు సంతోషం. కానీ... జీవించివుండగా ఆయన కృషి సంపూర్ణంగా పాఠకులందరికీ తెలియకుండా పోయిందే అనే బాధ!

*******

‘దాచేసిన’ దాగని సత్యం!

అసలు జనవరి 2011 ‘రచన’ విడుదలయ్యేవరకూ దాసరి సుబ్రహ్మణ్యం గారి రచనల విస్తృతి (నాతో సహా) పాఠకులకెవరికీ తెలీదు.

దా.సు. గారు ఏళ్ళ తరబడి గుండెల్లో దాచేసుకున్న తన రచనల రహస్యాలన్నీ దాసరి వెంకటరమణ గారికి స్వయంగా చెప్పారు. ఆయన ఇన్నాళ్ళూ వాటిని గుట్టుగానే ఉంచి, చివరకు ‘రచన’ జనవరి సంచికలో ‘ఈయన సామాన్యుడు కాదు!’ వ్యాసం ద్వారా పాఠకలోకం ముందు పెట్టారు.

( ఆ వ్యాసంలో కొంత భాగం ఇది...)



దా.సు. గారి రచనలను ఓసారి చూడండి-

బొమ్మరిల్లులో-   మృత్యులోయ (1971-74); శిథిల నగరం (74-75); మంత్రాల దీవి (76-80); గంధర్వ నగరం; సర్ప కన్య (80)

‘స్నేహబాల’లో-  మాయా గంధర్వుడు (1977)

‘ప్రమోద’లో-  కపాల దుర్గం (1978)

‘మిలియన్ జోక్స్’లో-  మాయా ద్వీపం (1980)

వీటిలో ఏమైనా నవలలు మీరు చదివారా?

... జాబితా ఇంకా అయిపోలేదు!

జంతువుల పాత్రలతో కథల సీరియల్స్ కూడా దాసరి సృష్టే.

చందమామలో... నక్క సవారీ, రాజప్రతినిధులు;

బొమ్మరిల్లులో.... కుందేలల్లుడు కథలు, ఖరభ శరభ కథలు;

ప్రమోదలో... అదురూ బెదురూ కథలు;

జాబిల్లిలో... రుద్రాభద్రుల కథలు;

మిలియన్ జోక్స్ లో... కేతక చాతకుల కథలు...

ఇవన్నీ!

ఇవే కాదు...

బొమ్మరిల్లు పాకెట్ సైజు పుస్తకాల్లో ‘రచయిత పేరు’ లేకపోతే అవి దాసరి సుబ్రహ్మణ్యం గారివే అయివుండటానికి ఆస్కారం ఉంది. ఆ పుస్తకాలు దొరికితే (పాత పుస్తకాల షాపులే శరణ్యం!) రచనా శైలిని బట్టి నిగ్గు తేల్చే ప్రయత్నం చేయవచ్చు. ఆ పుస్తకాల కోసం సాగుతున్న అన్వేషణలో మీరూ ఓ చేయి వేయవచ్చు.

అంటే... తెలుగులో బాలల పత్రికల ద్వారా జానపద కథా సాహిత్య సృష్టినంతా దాదాపు ఆయనొక్కరే... ‘ఏక వ్యక్తి సేన’లాగా నిర్వహించారన్నమాట... అనుపమానంగా, అనితర సాధ్యంగా!

అయినా...

ఏ పటాటోపమూ లేకుండా...

కీర్తి ప్రతిష్ఠలేమీ ఆశించకుండా ... నిష్కామంగా...

అనామకంగా...!

*******

‘పొరపాటు’న సరైన వ్యక్తినే అడిగా!

‘బొమ్మరిల్లు’లో వచ్చిన ‘మృత్యులోయ’ను దాసరి గారే రాశారని హైదరాబాద్ లో జరిగిన ఆయన సంస్మరణ సభలో తెలిసింది. ఆశ్చర్యానందాలతో ఉక్కిరిబిక్కిరయ్యాను!

నాకెంతో ఇష్టమైన నవల అది. అసలు ‘మృత్యులోయ’ అన్నపేరులోనే ఏదో వణికించే భీతి! ఆ లోయలో పడిపోయిన కథానాయకుల గురించి నా బాల్యంలో ఎంతో బెంగపడ్డాను. ఉత్కంఠభరితంగా ఆ సీరియల్ చదువుతూ వాళ్ళు మళ్ళీ ఎలా ఆ లోయ నుంచి బయటపడతారోనని చిన్నప్పుడు తెగ ఆలోచించేవాణ్ణి. అయితే ఆ నవలను ఎవరు రాశారనేది మాత్రం అసలెప్పుడూ ఆలోచించనే లేదు! (-:

బొమ్మరిల్లు సంచికలు అక్కడక్కడా మిస్ అయి, ఆ కథ ఎలా ముగిసిందో చాలాకాలం వరకూ తెలియనేలేదు. తర్వాత... చాలా సంవత్సరాలకు ఆ నవల బొమ్మరిల్లు రెండు పాకెట్ పుస్తకాలుగా విజయవాడ బస్ స్టాండ్ బుక్ స్టాల్లో దొరికినపుడు ఎంత సంబరపడిపోయానో! ఏకబిగిన చకచకా కథ మొత్తం చదివేశాను. ఇప్పటికీ ఉన్నాయి, ఆ పుస్తకాలు భద్రంగా!

కిందటి సంవత్సరం మే నెలలో అభిమానిగానే కాకుండా జర్నలిస్టుగా కూడా  విజయవాడలో దాసరి గారిని కలుసుకున్నా కదా? ఆయన కథానాయకుల గురించి వివరాలు అడుగుతున్నపుడు ‘యశపాల జయకేతులు’ అనే మాటే అప్రయత్నంగా నా నోటివెంట వచ్చింది. అయితే వీళ్ళు ‘మృత్యులోయ’ హీరోలు కదా అని వెంటనే స్ఫురించింది. నా ‘పొరపాటు’ను చప్పున సర్దుకుని, ‘రాతిరథం- యక్ష పర్వతం ’లోని ఖడ్గవర్మ, జీవదత్తుల ఆహార్యం గురించి అడిగేశాను.

అయితే ‘పొరపాటు’న సరైన వ్యక్తినే అలా అడిగాననీ, నా ఎదురుగా ఉన్న వృద్ధమూర్తే ఆ ‘మృత్యులోయ’ కర్త అనీ అప్పుడు తెలీదు నాకు! అసలు ఆయనకు వినికిడిశక్తి సరిగా ఉండివుంటే నా మాటలు విని, సగర్వంగా మెరుస్తున్న కళ్ళతో ‘మృత్యులోయ’ రాసింది నేనే’ అని చెప్పివుండేవారేమో!

ఇక ఆ సంభాషణ అంతటితో ఆగుతుందా? మిగిలిన ప్రచ్ఛన్న రచనల ప్రసక్తి తప్పనిసరిగా వచ్చివుండేది.

సాంఘిక కథలూ, డిటెక్టివ్ నవలలూ కూడా రాసిన సుబ్రహ్మణ్యం గారు దాసు , డి.భవానీ ప్రసాద్, టి. శంభుదాస్, సుజాతల పేర్లతో 1950ల నుంచి 80ల వరకూ రచనా వ్యాసంగం సాగించారు.

*******

మూడు పుస్తకాలూ కలిపి రూ.360కే !

‘యువ’ మాసపత్రికలో వచ్చిన ‘అగ్నిమాల’(1975) సీరియల్ లో మాత్రమే దాసరి సుబ్రహ్మణ్యం గారి పేరు ప్రచురించారు. ఆ ‘యువ’ సంచికలు దొరుకుతాయేమోనని దా.సు.గారు తన జీవితకాలంలో చాలా ఎదురుచూశారు. అది సాధ్యం కాలేదు.

వాటిని ఈ మధ్యనే ‘రచన’ శాయి గారు పట్టేశారు. (ఇదొక్కటే కాదులెండి, దా.సు. గారి సినీతార దుర్మరణం (ఆంధ్రప్రభ సీరియల్- 1953), ఇంకా చాలా సాంఘిక కథలను శాయిగారు అన్వేషించి, సాధించారనుకోండీ).




‘అగ్నిమాల’,

‘మృత్యులోయ’ నవలలనూ,

దాసరి గారి 39 సాంఘిక కథలనూ

మూడు పుస్తకాలుగా ‘వాహినీ బుక్ ట్రస్ట్’ తరఫున శాయి గారు ప్రచురిస్తున్నారు.

ఈ సాంఘిక కథల, జానపద నవలల ఆవిష్కరణ 2011 జనవరి 27న జరగబోతోంది.   సాయంత్రం 6 గంటలకు.

హైదరాబాద్ అశోక్ నగర్ లోని సిటీ సెంట్రల్ లైబ్రరీ సమావేశ మందిరంలో బాలసాహిత్య పరిషత్ ఈ ప్రోగ్రాం నిర్వహిస్తోంది.

ఇదిగోండి... ఆహ్వాన పత్రిక!


రూ.360 ఎం.ఒ./ డి.డి. ద్వారా ఇక్కడ ఇస్తున్న అడ్రసుకు పంపితే  ఈ  మూడు పుస్తకాలనూ రిజిస్టర్డ్ పోస్టులో అందుకోవచ్చు.

వాహినీ బుక్ ట్రస్ట్, 1-9-286/2/పి

విద్యానగర్, హైదరాబాద్- 500 044

ఫోన్ నంబర్ : 040-27071500.

Thursday, September 30, 2010

మృత్యులోయ ఎవరు వ్రాశారు

పై బొమ్మ సౌజన్యం బొమ్మరిల్లు పత్రిక, సేకరణ వేణువు వేణూగారు


ఇంతకాలం బొమ్మరిల్లు లో మొట్టమొదటి ధారావాహిక ఎవరు వ్రాశారు అన్న విషయం మీద అనేక ఊహాగానాలు చెలరేగాయి కాని, నిజం ఇది అని ఇదమిద్ధంగా ఎవరూ గట్టిగా చెప్పలేదు. ఇప్పుడది తెలిసిపోయింది. ఇది వారి 13 వ ధారావాహిక "ట" ఎవరి ధారావాహికా??

మృత్యులోయ ధారావాహికలో కూడ ఇద్దరు హీరోలు, ఒకరు రాజు కొడుకు మరొకరు మంత్రి కొడుకు. ఇద్దరూ వీరులే కాని, సహజంగా మంత్రి కుమారుడు తెలివితేటలతో రాణిస్తే, రాజు కొడుకు, వీరోచిత కార్యాలతోఆకర్షిస్తాడు. కథ మొత్తం ప్రయాణంలోనే నడుస్తుంది.

ఈ లక్షణాలన్నీ ఎవరి ధారావాహికలలో ఉంటాయి. మరింకెవరండీ , మన అభిమాన రచయిత శ్రీ దాసరిసుబ్రహ్మణ్యం గారి సీరియల్స్ లోనే కదా. ఇప్పుడు తెలిసిపోయిందా! బొమ్మరిల్లు ప్రారంభ ధారావాహిక ఎవరువ్రాశారో. మరెవరో కాదు దాసరి దాసరి సుబ్రహ్మణ్యం గారే . అప్పటికే ఆయన చందమామలో రాతి రథం వ్రాస్తున్నారు అనుకుంటాను. తానప్పటికే ఒక పత్రికలోవ్రాస్తూ ఉండటం , పైగా ఆపత్రికకు పోటీగా వస్తున్నపత్రికలో వ్రాయటం ఎలా? అందుకని రహస్యంగా వ్రాసారుట.
ఆయన తన ఉద్యోగ ధర్మాన్ని సవ్యంగా పాటించారా లేదా అన్నది కాదు ఇప్పుడు చర్చ. మనకు మరో చక్కటిధారావాహిక అందింది . అదే ఆనందం .

మరొక సంతోషించవలసిన విషయం ఏమంటే, దాసరి వారి మీద ప్రత్యెక సంచిక ప్రచురించిన మన "రచనశాయి" గారే దాసరి వారి కథలు, నవలలు అన్నీ కూడ (చందమామలో వచ్చిన ఆ డజను ధారావాహికలుతప్ప) పైన చెప్పిన మృత్యులోయ దారావాహికతో సహా ఒక సంపుటిగా తీసుకురావాలని నిర్ణయించారు. ఈ విషయంలో ఆయన దగ్గర నుండి వచ్చిన మెయిలుఈ కింద ఇవ్వటం జరిగింది. దాసరి సుబ్రహ్మణ్యం గారి అభిమానం ఉన్న వారందరూ, ఈ కార్యక్రమం లో పాలుపంచుకునే అవకాశం ఉన్నది. ఈ సంపుటి జనవరిలో ప్రచురించాలని నిర్ణయం తీసుకున్నారు, పెద్దగాసమయం లేదు. కాబట్టి దాసరి అభిమానులందరూ స్పందిస్తారని ఆశిస్తున్నాము

*********************************************

రచన శాయిగారి దగ్గర నుండి వచ్చిన మెయిల్ యధాతధంగా
Forwarded message -
From: sai yvsrs
Date: 2010/9/26
Subject: Dasari Subrahmanyam works - Publication
To: venu ch
, Sujatha , SIVARAMAPRASAD KAPPAGANTU , Raja Sekhara Raju , Venkata Ramana


Following is the consolidated appeal for possible display in your bolgs or informing other like minded people.

************************************************
Dear Friends:

I am in the process of collecting all stories of Sri Dasari Subrahmanyam garu - to the extent possible - with an optimistic view of getting them printed in a book form with the financial assistance of like minded friends.

So far collected 31 stories.

Apart from the Anthology of Short Stories, it is now contemplated to publish "Agnimaala' (Novel) serialized in Yuva - Telugu Monthly during Jan - Dec, 1975 and his 13th Janapada Novel 'Mrutyuloya' published in Bommarillu also.

The Project is so designed to involve all the admirer's of Sri Dasari garu. Sri Vasireddy Narayana Rao garu volunteered for suitable assistance.

It is proposed to release all the three books on 27th January, 2011 (first anniversary of Sri Dasari) at Hyderabad.

Those who are interested may contribute minimum of Rs.1000/- but not exceeding Rs.3000/- each enabling others to participate in the Project. Cheques/DD's to be made in favour of 'VAHINI BOOK TRUST' payable at 'Hyderabad' and sent to :

Vahini Book Trust
1-9-286/2/P ; Vidyanagar
Hyderabad - 500 044

You may please inform the Project details to like minded people also.

with best wishes

sai

************************************************


--
Y V S R S Talpa Sai
Editor - RACHANA Telugu Monthly
1-9-286/2/P Vidyanagar
Hyderabad - 500 044
e mail : rachanapatrika@gmail.com
Ph : 040 - 2707 1500
Mobile : + 99485 77517
visit : www.rachana.net


Wednesday, February 17, 2010

కథల మాంత్రికుణ్ని స్మరించుకున్నాం!



ఈ వ్యాసాన్ని ఈ కింది ప్లేయర్ లో వినవచ్చు

త
నకే సొంతమైన ఏకాంతంలోకి నిశ్శబ్దంగా , అనాయాసంగా అంతర్థానమైన రచయిత...

జానపద కథల మాంత్రికుడు..

దాసరి సుబ్రహ్మణ్యం గారు!

దశాబ్దాలపాటు ఆయన చందమామకు వెన్నెముకగా నిలిచారు. సంపాదక వర్గ సభ్యునిగా ఉత్తమ సంప్రదాయాలు నెలకొల్పారు.


1954
లో ‘తో్కచుక్క’తో మొదలైన ఆయన ధారావాహికల సమ్మోహన ఇంద్రజాలం 1980లో ‘భల్లూక మాంత్రికుడు’ వరకూ విజయవంతంగా కొనసాగింది.

చందమామ అనన్య ప్రచారానికి కారణమయింది. ఆ రచనల పున: ప్రచురణలు చదువరులకు చేరువై, చందమామ విలువను పెంచుతూ వచ్చాయి.

ఆయన అక్షరాలను మంత్రిస్తే..అవి అవధుల్లేని కథాకల్పనలయ్యాయి. వీర,బీభత్స,రౌద్ర,అద్భుత రసావిష్కరణలతో అపురూప జానపద కథలై నిలిచాయి. ఆ శైలీ విన్యాసం జవనాశ్వాలై పరుగులు పెడితే అసంఖ్యాక పాఠకులు ఉత్కంఠతో, ఆసక్తితో, ఇష్టంతో ఏళ్ళతరబడి చదివారు. ఆ అక్షర ‘చిత్రా’లను గుండెల్లో దాచుకున్నారు.


ప్రతి సంచిక కోసం విరహపడ్డారు.ఎదురుచూశారు.దశాబ్దాలు గడిచినా వాటిని తలపోసుకుంటూనే ఉన్నారు.

ఊహల విహంగాల రెక్కలపై తరతరాల పఠితలను..పిల్లలనూ, పెద్దలనూ వింత వింత లోకాల్లో విహరింపజేసి మంత్రముగ్ధులను చేశారు.


కానీ...ఆయన మాత్రం పేరు ప్రఖ్యాతులేమీ పట్టనితనంతో ఆ పాఠకులకు కూడా తనెవరో తెలియని అజ్ఞాత రచయితగానే ఉండిపోయారు!


ఉద్యోగ విరమణ చేసి,చెన్పై నుంచి విజయవాడ చేరుకుని, అన్నగారి కుమార్తె ఇంట్లో విశ్రాంత జీవితం గడిపేటప్పుడు మాత్రమే ఆయన గురించి కొద్దిమంది పాఠకులకైనా తెలిసింది.

చివరిదాకా తాను నమ్మిన హేతువాదం నుంచి పక్కకు పోని, స్థిర సంకల్పం ఆయనది.

సన్మానాల ,సత్కారాల, బిరుదు ప్రదానోత్సవాల్లో, పొగడ్తల దండల శాలువాల హడావుడిలో బడా సాహిత్య సంస్థలు ఎప్పుడూ బిజీనే. నాలుగు కాలాల పాటు నిలిచే నిజమైన సాహితీ కృషి చేసిన వారిని తల్చుకోవటానికి వాటికి తీరికెక్కడిదీ? పైగా దాసరి సుబ్రహ్మణ్యంగారు ఏ నాటి రచయిత? ఇలాంటివారిని పట్టించుకునే తీరిక వారికేం ఉంటుంది చెప్పండి!

ఇలాంటి పరిస్థితుల్లో -

జనవరి 27న కన్నుమూపిన దాసరి సుబ్రహ్మణ్యం గారిని తల్చుకోవటానికి హైదరాబాద్ లో ఎవరైనా చిన్న సభ పెట్టటం సంతోషకరమే కదా?

ఆ పని ‘బాలసాహిత్య పరిషత్’ వారు చేశారు.

నిన్న (ఫిబ్రవరి 16) సాయంత్రం హైదరాబాద్ చిక్కడపల్లి సిటీ సెంట్రల్ లైబ్రరీలో ఈ ప్రోగ్రాం జరిగింది.


సమావేశ మందిరంలో అడుగు పెట్టగానే సభ బ్యానర్ కనపడింది.గుమ్మం దగ్గరే టేబుల్ మీద దాసరి గారి రచనల పుస్తకాలు,చందమామ కథలు, ఆయన దస్తూరితో ఉన్న కథల రాత ప్రతులు కనిపించాయి.


వీటన్నిటికంటే ముందు 1947 జులై చందమామ తొలిసంచిక దగ్గర్నుంచి కొన్ని నెలల సంచికల బైండు కనిపించింది. ఈ సంచికలన్నీ ఇంతకుముందు పీడీఎఫ్ లుగా చూశాను గానీ, పుస్తకాలుగా ప్రత్యక్షంగా చూడటం ఇదే


మొదటిసారి. ఆ అనుభూతితో చందమామ పేజీలను ఆత్మీయంగా స్పర్శించి, తిరగేస్తుంటే చాలా సంతోషమనిపించింది. సుబ్రహ్మణ్యం గారి గురించి పత్రికల్లో వచ్చిన రచనలు అక్కడున్న గోడ మీద డిస్ ప్లే చేశారు.


వీటిని ఏర్పాటు చేయటం వెనక నిర్వాహకుల శ్రద్ధ అభినందనీయం.


పుస్తకాలను ఫోటో తీస్తుంటే అక్కడే ఉన్న దాసరి వెంకటరమణ గారు పలకరించారు.(ఆయన సేకరణే ఈ పుస్తకాలన్నీ).


సభలో రామవరపు గణేశ్వరరావు గారు, వాసిరెడ్డి నారాయణరావు గారు, అట్లూరి అనిల్ గారు దాసరి గారితో వ్యక్తిగతంగా తమ చిరకాల అనుబంధాన్నీ,జ్ఞాపకాలనూ గుర్తుచేసుకున్నారు. దాసరి వెంకట రమణ , చొక్కాపు వెంకట రమణ, మరికొందరు మాట్లాడారు.


జనాలతో ఎవరితోనూ కలవని అంతర్ముఖుడైన దాసరి గారి ఆత్మగౌరవం గురించీ, సాహితీ సభలకు వెళ్ళటంపై ఆయన అనాసక్తి గురించీ ప్రస్తావించుకున్నారు. గట్టివాడూ, మొండివాడుగా కనిపించే ఆయన సున్నిత స్వభావం గుర్తు చేసుకున్నారు.



చిన్నపిల్లల రచనలే కాకుండా దాసరి గారు రాసినవి ‘ఇంద్రాణి’ అనే కథాసంపుటి, పులిగోరు, భూతాల రాయుడు అనే పుస్తకాలున్నాయి. చందమామలోనే శంభుదాసు అనే పేరుతో కొన్ని కథలు రాశారు. ఇంకా దాసు, సుజాత, భవానీ ప్రసాద్ అనే కలం పేర్లతో కూడా రచనలు చేశారు.


తెలుగులో రచయితలు తమ జీవితకాలంలో స్వయంగా పట్టించుకోకపోతే వారి రచనల సేకరణ ఎప్పటికీ అసమగ్రంగానే ఉండిపోతుంది. కొ.కు. రచనల సంగతి అలాగే అయింది. ఎంతో క్రమశిక్షణతో రచయితలకు వారి రచనల గురించి శ్రద్ధగా లేఖలు రాసే సుబ్రహ్మణ్యం గారి రచనల విషయమూ అలాగే అవటం విచిత్రం! సుబ్రహ్మణ్యంగారు సొంతపేరుతో, కలం పేర్లతో రాసినవీ,అజ్ఞాతంగా ఇతర పత్రికల్లో చేసిన రచనలూ ఇంకా సేకరించాల్సేవుంది.


ఈ సంస్మరణ సభ మూలంగా కొన్ని విశేషాలు తెలిశాయి.


రచన శాయి గారు దాసరి గారి సాహిత్యాన్ని సేకరించటానికి చేసిన ప్రయత్నంలో శ్రీకాకుళం కథా నిలయంలో ఆయనవి 25 కథలు దొరికాయి. మరికొన్ని సేకరించాల్సినవి ఉన్నాయి.


ఇక శాయి గారు దాసరి సుబ్రహ్మణ్యం గారి పేరిట చందమామ తరహా కథను ‘రచన’లో ప్రతినెలా వేయాలనే సంకల్పాన్ని వ్యక్తపరిచారు. చందమామ చిత్రకారులు వేసినట్టే ఆ కథకు బొమ్మలు వేయించాలనుకుంటున్నానని చెప్పారు. ‘రచన’ ఏప్రిల్ సంచికను దాసరి గారి ప్రత్యేక సంచికగా తీసుకురాబోతున్నారు.


ఇక వ్యక్తిగతంగా నాకు సంతోషం కలిగించిన మరో విషయం- ‘బొమ్మరిల్లు’లో నా అభిమాన ధారావాహిక ‘మృత్యులోయ’ రచయిత ఎవరో ఇన్నేళ్ళకు తెలుసుకోగలిగాను; ఈ సభ కారణంగా!


కొసమెరుపు:
ఆత్మల ఉనికినే నమ్మని నాస్తికుడైన దాసరి సుబ్రహ్మణ్యం గారి ‘ఆత్మశాంతి’కోసం సభలో రెండు నిమిషాల మౌనం పాటించారు. కొందరు వక్తలైతే- అలవాటుగానేమో,ఆయన ‘స్వర్గస్థు’లయ్యారంటూ మాట్లాడేశారు!
దాసరి వెంకటరమణ, అట్లూరి అనిల్, వాసిరెడ్డి నారాయణరావు, రామవరపు గణేశ్వరరావు, చొక్కాపు వెంకటరమణ గార్లు.

Tuesday, February 9, 2010

దాసరి తాత సంస్మరణ సభ ఫిబ్రవరి 16 న

విచారాన్ని వదలండి మహారాజా! మన కథలను పిల్లలకు, పిల్లలకేమిటి పెద్దలకు కూడా చక్కగా చెప్పగలిగిన అటువంటి చక్కటి రచయిత ఇక రాబోరు, అదే నా బాధ కూడా. కాని ఏమి చేస్తాం, మనుషులం!! ఏదో ఒకరోజున మరణం తప్పదు కదా! ఉన్నవాళ్ళం పోయిన వారి గుణగణాలను గుర్తుంచుకుని వారి మంచితనాన్నిసంస్మరణ చేయటమే మన చేతులలో ఉన్నది .

చందమామ అభిమానులు హైదరాబాదులో దాసరివారి సంస్మరణ సభ పదహారు ఫిబ్రవరిన ఏర్పాటు చేసారట మన వాళ్ళు అందరిని కేకేసి ఆ సభకు వెళ్లి వద్దాం ప్రభూ.

అలాగే మహా మంత్రీ! తప్పకుండా ఏర్పాట్లు చేయించండి, మేమూ సపరివారంగా వస్తాం.

=======================================================================================================================


తేది: 9 ఫిబ్రవరి 2010 11:07 am
సబ్జెక్టు: [chandamama_priyulu] దాసరి సుబ్రహ్మణ్యం సంస్మరణం
కి: chandamama_priyulu@yahoogroups.com

దాసరి వెంకట రమణ గారు ఈ క్రింది మెయిలు పంపారు. హైదరాబాదు, విజయవాడలలో ఉన్న చందమామఅభిమానులు తప్పక పాల్గొంటారని అశిస్తున్నాను.

-త్రివిక్రమ్
------------------------------
------------------------------------------------------------
త్రివిక్రమ్ గారికి నమస్కారం

దాసరి సుబ్రహ్మణ్యం గారు ఈ మధ్యే పరమపదించారు. మీకు ఈ విషయం బహుశ వార్తా పత్రికల ద్వారా తెలిసివుంటుంది. ఈ నెల పదహారో తేదిన మంగళ వారం సాయంత్రం ఆరు గంటలకు హైదరాబాద్ సిటీ సెంట్రల్ లైబ్రరీ లెక్చర్హాలు నందు సంస్మరణ సభ ను బాల సాహిత్య పరిషత్తు హైదరాబాద్ పక్షాన ఏర్పాటు చేయటం జరిగింది. అలాగే ఈ నెలఇరవై ఒకటో తేది ఆదివారం విజయవాడలో ప్రజాసాహితి పక్షాన ఏర్పాటు చేయటం జరిగింది ఈ విషయం చందమామఅభిమానులకు తెలియచేయ గలరు.
రచన వచ్చే సంచికను దాసరి సుబ్రహ్మణ్యం సంస్మరణ సంచికగా వేయటానికి రచన శాయి గారు నిశ్చయించారు. ఆవిషయమై ఒకసారి శ్రీ శాయి గారితో మాట్లాడండి.

మీ స్పందన కోసం ఎదురు చూస్తూ. - దాసరి వెంకట రమణ

--------------------------------------------------------------------------------------------------

చందమామలో ఎక్కువ ధారావాహికలు రచించిన శ్రీ దాసరి మరణ వార్త విని బాధపడని చందమామ అభిమాని లేరు. ఆయనను గుర్తుకు తెచ్చుకుంటూ హైదరాబాదులో ఒక సంస్మరణ సభ జరుప తలవటం ముదావహం. చందమామ అభిమానులు అందరూ ఈ సభకు హాజరై తమకున్న జ్ఞాపకాలను పంచుకోగలరు.


ఈ విషయాన్ని మనకు తెలియచేసిన శ్రీ దాసరి వెంకట రమణ మరియు శ్రీ త్రివిక్రమ్ లకు ధన్యవాదములు.






********************************************************************************************

Thursday, January 28, 2010

జానపద కథల మాంత్రికుడి అంతర్థానం!


వర్తమాన చరిత్రకు వార్తా పత్రికలు అద్దం పడతాయంటారు. అయితే, ‘Journalism is literature in a hurry' కాబట్టి వాటిలో పొరపాట్లు కూడా సహజమేనని సరిపెట్టుకోవాలేమో.

అద్భుత జానపద ధారావాహికలతో తరతరాల ‘చందమామ’ పాఠకులను ఉర్రూతలూగించిన దాసరి సుబ్రహ్మణ్యం గారి మరణ వార్తను పాఠకులకు అందించటానికి ప్రయత్నించిన పత్రికలను అభినందించాల్సిందే.

అయితే-

బుధవారం (జనవరి 27) విజయవాడలో కన్నుమూసిన ఆ జానపద కథల మాంత్రికుడి  గురించి రెండు పత్రికల్లో వచ్చిన వార్తల్లో factual error దొర్లింది.

‘భేతాళ మాంత్రికుడు ఇక లేరు’అని శీర్షిక ఇచ్చిన పత్రిక ఆయన్ను ‘భేతాళ కథల సృష్టికర్త’గా అభివర్ణించింది.బేతాళుణ్ని భేతాళుడిగా రాయటం కాదు- ఇక్కడ సమస్య.


మరో పత్రిక ‘ఆగిన ‘చందమామ’ బేతాళ కథ’ అనే శీర్షికను ఇచ్చింది.‘బాల కథాసాహిత్యంలో చిరస్థాయిగా నిలిచిపోయిన బేతాళ కథలను దాసరి సృష్టించారు.ఐదు దశాబ్దాలపాటు బేతాళకథలు రాశారు’ అని పేర్కొంది.

వాస్తవానికి- దాసరి గారు బేతాళ కథల సృష్టికర్త కాదు!

చక్రపాణి, కొడవటిగంటి కుటుంబరావు గార్ల ఆలోచనలే చందమామలో బేతాళ కథలకు నాంది పలికాయి. 1980 తర్వాత మరో పాతికేళ్ళపాటు దాసరి గారు సంపాదక వర్గ సభ్యుడుగా బేతాళ కథలను పర్యవేక్షించినా, ఆయన ప్రధాన రచనా వ్యాసంగాన్ని ఆ కథలతో ముడిపెట్టటం సరి కాదు.


అసలు సుబ్రహ్మణ్యం గారి మౌలిక కృషి అజరామరమైన జానపద ధారావాహికలు. చందమామ పాలసీ మూలంగా ఆయనకు దక్కాల్సిన పేరు దక్కనే లేదు.జానపద సీరియల్స్ ను ఏళ్ళ తరబడి ఆనందించిన పాఠకులు కూడా రచయిత ఎవరో తెలియక, ఆయన్ను గుర్తుంచుకోలేదనిపిస్తుంది.

అసలు కృషిని సరిగా పట్టించుకోకుండా, దాసరి గారికి నేరుగా సంబంధం లేని కీర్తిని ఆపాదించటం ఆయనకు గౌరవం కాదు!

దశాబ్దాల తరబడి, సాహిత్య సృష్టి చేసిన రచయితల కృషి గురించి కూడా ఇలా తారుమారు జరుగుతున్నపుడు-

ఇరవై ఒకటో శతాబ్దంలో,సమాచార యుగంలో కూడా ఇలాంటి దుస్థితా? అనిపిస్తోంది!

....


'I am overstay here' అని తన పెద్ద వయసు గురించి జోక్ వేసుకున్న అపురూప రచయిత దాసరి గారు.

‘కొ.కు.గారు 1980లో నాకన్న ముందుపోవడం నాకు తీరని ఆవేదన’ అంటూ బాధపడి, ఆ మాటలన్న ఎనిమిది మాసాలకే జీవితం చాలించారు.


2009 మేనెల మొదటివారంలో దాసరి సుబ్రహ్మణ్యం గారిని విజయవాడలో రెండోసారి (చివరిసారి) కలిశాను.ఆయనకు వినికిడిశక్తి తగ్గిపోవటంతో రైటింగ్ పాడ్ మీద ఒక్కో ప్రశ్న రాసిస్తే, దానిమీదే స్వయంగా సమాధానాలు రాశారు.

సిగరెట్ తాగుతూ ఆ పొగ లోపలి గదిలోకి వెళ్ళకుండా ఆ తలుపు మూసి, ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్లిపోయారు. స్మృతులను నెమరువేసుకున్నారు. ‘స్మోకింగ్ ని మాత్రం వదల్లేకపోయాను’అని ఒప్పుకున్నారు, అడక్కుండానే.


‘మీ జానపద సాహిత్యానికి ప్రేరణ ఏమిటి?’ అని అడిగినప్పుడు చాలా సంతోషించారు.అది ఆయన మొహంలో వ్యక్తమవ్వలేదు కానీ, ‘మేలిమి బంగారంలాంటి ప్రశ్న అడిగారు’ అంటూ సమాధానం ప్రారంభించినపుడు ఆయన సంతోషం అవగతమయింది.


2008లో దసరా రోజున విజయవాడలో ఆయన అడ్రస్ అన్వేషించి , నివాసానికి వెళ్ళి తొలిసారి దాసరి గారిని చూడబోతున్నపుడు ఎంత ఉత్కంఠ అనుభవించానో ఇప్పటికీ గుర్తొస్తోంది. ఇంటిలోపల్నుంచి మెల్లగా నడిచొచ్చిన పొడుగ్గా, బలహీనంగా ఉన్న వృద్ధమూర్తిని చూడగానే సంబరంగా ‘ఈయనేనా అంతటి అద్భుత రచనలు చేసిన రచయిత!’ అనుకోకుండా ఉండలేకపోయాను.


ఆయన జీవన సంధ్యలో రెండు సార్లు వ్యక్తిగతంగా కలుసుకోగలిగాననే తృప్తి మాత్రమే ఇప్పుడు మిగిలింది.

ఇచ్చిన విజిటింగ్ కార్డును వెనక్కి తిప్పి, నేను ఆయన్ను కలిసిన తేదీని ఎంత శ్రద్ధగా రాసుకున్నారో.

ఇంటర్వ్యూ చేసిన గుర్తుగా ఆయన ఏటవాలు చేతిరాతతో ఉన్న రైటింగ్ ప్యాడ్ దీనంగా,విషాదంగా...నా దగ్గర!


...


మంత్రముగ్ధులను చేసే దాసరి సుబ్రహ్మణ్యం గారి కథా కథన శైలి ఎలా ఉంటుందో గుర్తు చేసుకుందాం-

‘హఠాత్తుగా వారికి ఒక పొదచాటు నుంచి సింహం గర్జించిన ధ్వని వినబడింది. రాజకుమారులిద్దరూ, ఆ ధ్వని వచ్చిన వైపుకు తలలు ఎత్తి, బాణాలు ఎక్కుపెట్టేలోపలే, రెండు సింహాలు గర్జించుతూ వారికేసి దూకినై. సింహాలను చూస్తూనే రాజకుమారులు ఎక్కివున్న గుర్రాలు బెదిరి వెనుదిరిగి వేగంగా పారిపోసాగినై.’ (జ్వాలాద్వీపం)

‘హేయ్, కాలభుజంగా!కంకాళా!రండి,రండి!ఆ చతుర్నేత్రుణ్ణి వెతికి పట్టి హతమార్చండి!’అనే ప్రళయ భీకర నాదం దశదిశలా వ్యాపించింది’ (తోకచుక్క).
...

చందమామ చరిత్ర బ్లాగు లో రాజు గారు నిన్న (గురువారం) సమగ్రంగా రాసిన టపా కూడా చూడండి.

శ్రీ దాసరి సుబ్రహ్మణ్యం గారు - జానపద ధారావాహికా స్రష్ట


కీర్తిశేషులు దాసరి సుబ్రహ్మణ్యం గారు
శ్రీ దాసరి సుబ్రహ్మణ్యం గారు చందమామలో ఐదు దశాబ్దాల పైగా పని చేసారు. చందమామ ఉన్నతికి ఆయన చేసిన కృషి అనిరతరం. చందమామలో ఆయన నిర్వహించిన అనేకానేక అద్భుత శీర్షికలలో వారు రచించిన ధారావాహికలు తలమానికమైనవి. చందమామకు వన్నె తెచ్చినవి, ఆయన రచించిన పన్నెండు ధారావాహికలు. ఈ ధారావాహికలు ఎంత పాఠకాదరణ పొందినాయంటే, అవ్వే సీరియల్స్ చందమామలో పున:ముద్రణ చేస్తున్నారు . తెలుగు పత్రికా చరిత్రలో ఈ విధంగా ధారావాహికలను పున:ముద్రణ చేయటం బహుశా వీరివే అయ్యి ఉంటాయి. ఆయన సృష్టించిన జానపద కథా పాత్రలు పిల్లల మనస్సుల్లో చెరగని ముద్రలు వేశాయి. నేను కూడ, ఆయన ధారావాహికలు చదువుతూ పెరిగిన వాడినే. ఆయన మరణ వార్త వినగానే కలిగిన విచారం, ఆ విచారాన్ని మరవటానికి ఆయన పాత్రలే ఆయనకు నివాళి అర్పించటం వ్రాసుకున్నాను. ఆ కథనాన్నే ఈ కింద ఇస్తున్నాను.

ఈ కథనం ప్రచురణ తరువాత, చందమామ వారు నన్ను సంప్రతించి, ఈ కథనాన్ని యధాతధంగా ఆన్ లైను చందమామలో ప్రచురించారు. చందమామలో ప్రచురితమైన కథనాన్ని కింద లింకు నొక్కి చూడవచ్చు.

జానపద కథా బ్రహ్మ

నా బ్లాగులో నేను వ్రాసిన వ్యాసం, ఒక పత్రికలో ప్రచురించబడటం ఇదే మొదటిసారి, అదీ నా అభిమాన పత్రిక చందమామలో అవ్వటం నాకు ఎంతగానో ఆనందంగానూ గర్వంగానూ ఉన్నది.
======================================================================
"ఖడ్గవర్మా ఆగు ఆగు నేను కూడ వస్తున్నాను" అని పరుగు పరుగున వచ్చి చేరుకున్నాడు శిఖిముఖి. "ఏమిటి ఖడ్గావర్మా, నిన్న గాక మొన్న వచ్చారు మా గూడెంలోకి ఇక్కడ ఉన్న జీవదత్తుని చూడటానికి, అప్పుడే ఏమిటీ తొందర వెళ్లిపోవటానికి ? అరే జీవదత్తా! నువ్వు కూడ వెళ్ళిపోతున్నావా, ఇదేమి పని ఖడ్గావర్మా, నువ్వోచ్చి ఈయన్ని కూడ లాక్కెళ్ళి పోతున్నావే ?" అన్నాడు శిఖిముఖి కొంచెం నిష్టూరంగా శిఖీ! ఏమిటి నీకు ఇంకా తెలియదా, విక్రమకేసరి ఇప్పుడే కబురు పంపాడు, పూజ్యులు, మనందరినీ సృష్టించిన మన దాసరి సుబ్రహ్మణ్యంగారు ఇక లేరట. నిన్న రాత్రి అనారోగ్యంతో నగరంలో మరణించారుట. విక్రమకేసరి కబురు పెట్టాడు. దూమక సోమకులూ, పింగళుడు, ఆ తరువాత రాకాసి లోయ లో కుర్రాళ్ళు జయమల్లుడు, కేశవుడు కూడ ఇప్పటికే అక్కడకు చేరి ఉంటారు. మన మిగిలిన వాళ్ళందరూ కూడ ఆయన్ని చూడటానికి బయలుదేరారుట. పద పద మనం కూడ వెళ్లి మన గురువుగారిని చివరి చూపు చూసుకుందాము.

ఈ వార్త వినంగానే శిఖిముఖి వలవలా ఏడిచేశాడు. అయ్యో ఆయ్న అప్పుడే వెళ్ళిపోయారా అని రోదించాడు. జీవదత్తుడు, ఖడ్గవర్మ అతన్ని అనునయించారు. జీవదత్తుడు స్వాంతన వ్యాక్యాలు పలికాడు. అలా వీళ్ళు విచారంగా నడుచుకుంటూ వెళ్తున్నారు. జీవదత్తుడు అన్నాడు, దాసరి వారు ఈ మధ్య వరకూ కూడ బాగానే ఉన్నారుట, వేణు అని ఒకాయన ఈ మధ్యనే వెళ్లి ఆయన్ను చూసి వచ్చి, ఆయన గురించి వ్రాసారు. ఇప్పటికీ ఏదో ఒకటి వ్రాసుకుంటూనే ఉన్నారుట. కాని పాపం వినికిడి పూర్తిగా పోయిందట, కాని ఆరోగ్యంగానే ఉన్నారట.


"సరే జీవదత్తా! నువ్వు ఈ విషయాలన్నీ కూడ సేకరించావు కదా . కొంచెం మన సృష్టికర్త గురించి వివరాలు చెప్పగలవా," అని అడిగాడు శిఖిముఖి వచ్చే దు:ఖాన్ని దిగమింగుకుంటూ . అలాగే! వినండి. దాసరి వారు ఎప్పుడు పుట్టారో సంవత్సరం ఆయనకే తెలియదుట. కాని ప్రస్తుతం ఆయన వయస్సు రమారమి 88 సంవత్సరాలు ఉండవచ్చు అని ఆయనే అంచనా వేసి చెప్పినట్టు మన వేణుగారు వ్రాసారు. సుబ్రహ్మణ్యంగారు తన 29 వ ఏట మన జన్మ స్థలమైన చందమామలో కి వచ్చి చేరారుట. మొట్టమొదట సమరసేనుడు, ఏకాక్షి వంటి వారిని తయారుచేసి తోక చుక్క వ్రాసారుట. మొత్తం మీద చందమామలో ఇరవై నాలుగు సంవత్సరాలలో పన్నెండు ధారావాహికలు వ్రాసారు. మనలాంటి వారిని ఎందరినో తెలుగులో పిల్లలకి పరిచయం చేసారు.

"జీవదత్తుడు గారూ ఆ పన్నెండు ధారావాహికలు ఏమిటో చెప్పరూ" కొత్త గొంతు, కొత్త పలకరింపు. ఖడ్గవర్మ దబుక్కున ఆ వ్యక్తి చెయ్యి పట్టుకుని, "ఓరి ! అరణ్య పురాణం మౌగ్లీ నువ్వెప్పుడు వచ్చావు. అయినా నీకు దాసరి వారికి బంధుత్వం లేదుగా ? నువ్వేక్కడకి బయలుదేరావు". అన్నాడు. అదేమిటిలే ఖడ్గా, మనందరితో పాటు ఆ చందమామలోనే ఉండేవాడు మన మౌగ్లీ ఆ మాత్రం ఆపేక్ష ఉండదూ. సరే మౌగ్లీ విను, దాసరి వారు వ్రాసినవి పన్నెండు ధారావాహికలు. అందులో కొన్ని జంట ధారావాహికలు. అంటే ఒక ధారావాహిక అయిపోయినా, అందులో ఉన్న పాత్రలతోనే మరొక ధారావాహిక వెను వెంటనే వ్రాశేవారు. అలా వ్రాసినవి, తోక చుక్క-మకర దేవత, రాతి రథం-యక్ష పర్వతం. ఇక మిగిలిన ధారావాహికలు, జ్వాలాదీపం, కంచుకోట, ముగ్గురు మాంత్రికులు, పాతాళ దుర్గం,రాకాసి లోయ, మాయా సరోవరం మనకందరికీ ఇష్టమైన శిధిలాలయం. చిట్టచివరగా ఆయన వ్రాసిన ధారావాహిక భల్లూకమాంత్రికుడు.

మనందరికీ రూప కల్పన చేసినది చిత్రాగారు. ఒరే, మౌగ్లీ నీకు రూపు రేఖలు ఇచ్చినది వడ్డాది పాపయ్య గారు గుర్తుందికదూ". మౌగ్లీ వెంటనే "అయ్యో! లేకపోవటమేమిటి? నేనింత అందంగా ఉండటానికి కారణం ఆ తాతగారేకదా". జీవదత్తుడు చప్పున అందుకుని, సరె మాటలు ఎటో పోతున్నవి, నేను చెప్పొచ్చేదేమిటంటే , దాసరి వారి చివరి ధారావాహిక వచ్చేప్పటికి, చిత్రాగారు లేరు. ఆయన వెళ్ళిపోయారు. అందుకని, భల్లూక మాంత్రికుడు లో వాళ్ళందరూ మనలాగ ఉండరు.

అబ్బాయిలూ ఇలా ధారావాహికలేకాదు, మన దాసరి వారు బహుముఖ ప్రజ్ఞావంతులు. కొన్ని ఇతర కథలు కూడ వ్రాశారుట. అరెరే!! ఎవెరు వీళ్ళు ఇలా కాళ్ళకు అడ్డంపడుతున్నారు. శిఖిముఖీ వీళ్ళను చూడు. ఇలా దగ్గరకు రండిరా" అన్నాడు జీవదత్తుడు. ఓరినీ మీరురా దాసు-వాసు, మీరూ వచ్చేశారా, అట్టమీద బొమ్మల్లో వచ్చేవారు మీరు. సరే పదండి వెళ్ళి మన దాసరి వారిని చివరిసారి దర్శనం చేసుకుందాం.

ఇలా వీళ్ళందరూ నగరానికి వెళ్ళేప్పటికి అక్కడ దు:ఖిస్తూ దాసరివారి పాత్రలన్ని కూడ అక్కడే కూడారు. అందరూ కలసి తమ సృష్టి కర్తకు ఘనంగా నివాళి సమర్పించి వెనుతిరిగారు.

శ్రీ దాసరి సుబ్రహ్మణ్యంగారి అంత్యక్రియల సందర్భంగా ఖిన్న వదనులై చూస్తున్న విక్రమకేసరి, శిఖిముఖి
===================================================================
ఈలోగా ఆ పైన, అంటే తెలుసుగా. అక్కడన్నమాట. మడమలమీదకు కట్టుకున్న పంచె, లాల్చీ ధరించిన ఒక సన్నటి మనిషి మెల్లిగా మేఘాల మధ్యలో విసుగ్గా నడుచుకుంటూ వచ్చి, "ఏందయ్యా! దాసరీ!! ఇంతకాలానికా రావటం?, ఏముందనబ్బా ఇంతకాల ఉండావు అక్కడా. ఎముండాది?? ఇప్పుడు అంతా కొట్తుకుసస్తా ఉండారే, సరేకాని రా! రా!! ఎంత కాలానికి ఎంతకాలానికి" అని వచ్చి సాదరంగా ముందుకు వచ్చారు. "అయ్యా! చక్రపాణిగారూ నమస్కారం. మీరేమీ మారలేదండి. ఇక్కడి వాతావరణంలో కూడా అలాగే ఉన్నారు" . ఆ ఏముండాది ఇక్కడ ఒక ఆకలీ లేదు పాడూ లేదు, ఈ మేఘాలొకటి మధ్య మధ్యలో దూది పింజలల్లే అడ్డుపడుతూ. ఆ ఇంద్రుడున్నాడంటే ఇంత తాగనూ అట్టా పడి ఉండనూ. చూడు పాపం చిత్రా గారు బొమ్మలు వెయ్యటానికి మంచి కథలు లేక ఎలా బాధపడుతున్నాడో. ఇదిగో రాఘవులూ ఇక మనందరికీ మంచి కాలక్షేపమయ్యా, ఇక కథలే కథలు. దాసరి వచ్చేశాడు మన దగ్గరకి. "అయ్యా దాసరి గారూ,ఎంత కాలమయ్యిందండి మిమ్మల్ని చూసి అంటూ ఆప్యాయంగా వచ్చి కౌగలించుకున్నాడు చిత్రా. దాసరి గారు ఆనందంతో తబ్బిబ్బవుతూ, నాకు కూడ ఎంతో ఆనందంగా ఉన్నది, ఇక్కడకు వచ్చి మీ అందరినీ కలుసుకోవటం. ఏం చిత్రా ఎలా ఉన్నావయ్యా. ఎన్ని సార్లు నీ గురించి జ్ఞాపకాలు. సరే కాని, ఇక్కడేమన్న పత్రిక ఉంటుందా" అన్నారు దాసరి ఆసక్తిగా . "ఆడి బండ పడ ఇంద్రుడేమి పత్రిక పెట్టలా, ఒకటే డాన్సులు తప్ప. ఓయ్! నాగిరెడ్డీ అలా పోతుండావే, మన దాసరి వచ్చేసిండయ్యా . మనం ఇక్కడే మరో పత్రిక పెట్టాలంట. ఏమిటిమరి" అన్నారు చక్రపాణిగారు. "అహాహా !! ఏమిటి ఇవ్వాళ ఎంత బాగున్నది అనుకుంటున్నాను చక్కన్నా, అదీ సంగతి దాసరి గారు వచ్చి చేరిపొయ్యారన్న మాట. సరే సరే అంటానికేమున్నది పెట్టేద్దాం పత్రిక , అందరం ఇక్కడే ఉన్నాంకదా" అన్నారు నాగిరెడ్డిగారు . "మరి మన వపా అదేనండి పాపయ్య గారు ఎక్కడ" అన్నారు దాసరి చుట్టూ చూస్తూ. వెంటనే చక్కన్న అందుకుని, నీకు తెలవందేముంది దాసరీ, అక్కడ ఊర్వసిని చూస్తా ఆవిడ అందం అంతా బొమ్మలోకి ఇరికిస్తా ఉండాల. పదండి ఆయన్ని కూడ కలుపుకుందాం" అంటూ చక్రపాణిగారు ముందుండి దారి తీశారు, అందరూ స్వర్గం లోపలికి వెళుతున్నారు.

ఇక స్వర్గంలో వాళ్ళ అదృష్టం మంచి కథలు, బొమ్మలు, నిజంగా స్వర్గమై పోయింది.
====================================================================

తమ సృష్టికర్త మరణ వార్త విని బాధపడుతున్న ఇతర పాత్రలు