Monday, November 16, 2009

తాతయ్య కథలు

ప్రస్తుతం ఉన్న కుటుంబ వ్యవస్థలో, తాతయ్యలు, బామ్మలు, అమ్మమ్మలు ఎక్కువగా కనపడరు. వాళ్ళెక్కడో పల్లెలోనో,పట్నంలోనో లేదా ఏ వృధ్యాప్య గృహంలోనో ఒంటరిగా కాలగడుపుతుంటే, పిల్లలు, మనవలు మనవరాళ్ళు ఉద్యోగరీత్యా ఎక్కడెక్కడో ఉంటారు. కొన్ని కొన్ని సందర్భాలలో మనవలకు మనవరాళ్ళకు తాతయ్య ఎవరో తెలియదు, తాతయ్యకు వీళ్ళను చూసే అవకాశం వచ్చి ఉండదు. మరికొన్ని దురదృష్ట సందర్భాలలో మనవలకు మనవరాళ్ళకు తమ తాతయ్య మాట్లాడే భాష అర్థం కాదు, ఎందుకంటే వాళ్ళు విదేశాలలో పెరిగి ఉంటారు. నేటి ఈ కాలంలో, ఉమ్మడి కుటుంబ వ్యవస్థ దాదాపుగా కనుమరుగయ్యింది.

ఇంత ఉపోద్ఘాతం ఎందుకంటే, పూర్వపు రోజులలో 50-60 దశకాలలో కూడ, మనకున్న చక్కటి కుటుంబ వ్యవస్థను ప్రతిబింబిస్తూ, చందమామ వారు "తాతయ్య కథలు" అన్న శీర్షిక పేరుతో అనేక కథలు ధారావాహికగా ప్రచురించారు. ఈ చక్కటి శీర్షిక 1960 ఆగస్టు నెలలో మొదలయ్యి 1961 మే నెలవరకు వేశారు. ఆ తరువాత మే 1962 నుండి జులై 1963 వరకు ధారావాహికగా ప్రచురించారు. ఆ తరువాత నవంబరు 1968, ఫిబ్రవరి మరియు ఏప్రిల్ 1969 నెలలో కూడ ఈ కథలను పాఠకులకు అందించారు.

ఈ కథలలో మొట్టమొదటి కథ పేరు అదృష్టం, చిట్టచివరి కథ పేరు మట్టి కాళ్ళు.

తాతయ్య కథల రచయితలు

సర్వశ్రీ
సి శేషాద్రి
చల్లా లక్ష్మి గారు
ఆర్ బయవ రెడ్డి
ఎ వ్ శేషాద్రి
మాధవరెడ్డి చంద్రశేఖర్

వీరిలో ఎక్కువ తాతయ్య కథలను వ్రాసినవారు సి శేషాద్రి గారు. ఈ శీర్షికకు బొమ్మలు వేసినది ప్రముఖ చిత్రకారులు చిత్రాగారు. అప్పుడప్పుడు శంకర్ గారు కూడ బొమ్మలు వేశారు.

ముఖ చిత్రం చూడండి తాతయ్య మెల్లిమెల్లిగా ముసలివాడయినట్టుగా వేశారు. చివరి భాగంలో తాతయ్య చాలా ముసలివాడయిపోయాడు. తాతయ్య నోటిద్వారా చక్కటి కథలను అందించిన చందమామవారు పిల్లల వ్యక్తిత్వ వికాసానికి ఎంతగానో పాటుబడ్డారు.
చందమామ లో తాతయ్య కథలు చదవాలని ఉన్నదా! చందమామ వారు వారి సైటులో చాలా పాత చందమామలను ఉంచారు. చక్కగా అక్కడకు వెళ్లి చదువుకోవచ్చు.

2 comments:

  1. చందమామను ఎప్పటికి మరువలేను. ఇప్పటికి చందమామ చదవటమంటే మహాఇష్టం.

    ReplyDelete
  2. >> "ప్రస్తుతం ఉన్న కుటుంబ వ్యవస్థలో, తాతయ్యలు, బామ్మలు, అమ్మమ్మలు ఎక్కువగా కనపడరు"

    'మేమిద్దరం, మాకొక్కరు' విధానం వల్ల త్వరలో పిన్నిలు, బాబాయిలు, మేనమామలు, మేనత్తలు, బావలు, మరదళ్లు వగైరా కూడా కనపడరు.

    ReplyDelete

1. అజ్ఞాత వ్యాఖ్యలు లేదా ప్రొఫైల్ లేకుండా వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు.
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు ప్రచురించబడవు.