Friday, April 22, 2011

దుష్ట చతుష్టయం

పాండవులను లక్క ఇంట ఉంచి, ఇంటిని అగ్నికి ఆహుతి చేసి, వారిని తుదముట్టించాలని, పథక రచన చేస్తున్న దుష్ట చతుష్టయం. వపా గారి కుంచే నుండి జాలువారిన మరొక చక్కటి చిత్రం. చందమామలో మహాభారతం ధారావాహిక వచ్చే రోజుల్లో, అట్ట చివరి బొమ్మగా వచ్చింది బొమ్మ.

Thursday, April 21, 2011

పంచతంత్ర కథకు వపా బొమ్మ

ఇదొక పంచతంత్ర కథ. నాకు గుర్తున్నంత వరకూ వ్రాస్తాను. ఒక చింపాంజీ అన్ని విద్యలూ నేర్చి అచ్చం మనిషిలా ఉండటం నేర్చుకుని దేశ రాజుగారి దగ్గరకు వెళ్లి తన విద్యలన్నీ చూపిందట . ఆయన చింపాంజీ విద్యలు అన్ని చూసి మురిసిపోయి, తన అంగరక్షకునిగా నియమించారుట. ఒక రోజున రాజుగారు హాయిగా శయనిస్తూ ఉండగా, చింపాంజీ అంగరక్షకుడు కాపలా కాస్తున్నాడు. కాసేపటికి ఒక కీటకం రాజుగారి మీద వాలింది. చింపాంజీ గారు కీటకాన్ని తరమబోయ్యారు, కీటకం అక్కడ నుంచి కదలలేదు. చింపాంజీ అంగరక్షకుడు కీటకాన్ని తరమటమే తన కర్తవ్యం అనుకుని కత్తితో ఒక్కటి వేశాడు. కీటకం తప్పించుకుని ఎగిరిపోయింది, కాని పాపం రాజుగారు కత్తి వేటుకు మరణించాడు.

మనిషికి ఎన్నెన్ని విద్యలు తెలిసినా "బుద్ధి" లేకపోతె విచక్షణ ఉండదు. విచక్షణ తెలియని వారికి ఎన్ని విద్యలున్నా వృధాయే కాక ప్రమాదం కూడా!

పాపయ్య గారు చింపాంజీ ముఖంలో చక్కటి భావాలను తన కుంచెతో స్పురింపచేసారు.

వాలీ సంహారం

వడ్డాది పాపయ్య గారి చిత్ర కళా వైభవం గురించి ఎంత వ్రాసినా తక్కువే! పై బొమ్మలో వాలి సంహార ఘట్టాన్నికళ్ళకు కట్టినట్టు ప్రతి పాత్ర హావభావాలతో ఎంత చక్కగా చిత్రీకరించి బాలలకు మళ్ళీ చెప్పోస్తే పెద్దలకే ఎక్కువగా సంఘటన చక్కగా అర్ధం అయ్యేట్టుగా తన కుంచే నుండి రంగు రంగులతో చక్కగా ఆవిష్కరించారు. చందమామ బొమ్మలలో ఉన్న గొప్పతనమే అది, అలా చూసి కథను అర్ధం చేసుకోవచ్చు.

హావభావాలు

రాముడు : అధర్మ యుద్ధం చేసి కొట్టినందుకు వాలి నిందిస్తుంటే నోట మాట రాక నివ్వెరపోతూ

వాలి: తన చరమ దశలో తగిలిన దెబ్బకు ప్రాణ శక్తి వెళ్లిపొతుండగా కూడ తన పౌరుషాన్ని మాటల బాణాలలో కూరుస్తూ

సుగ్రీవుడు: తన సోదరుని చివరి క్షణాలు చూసి శోకిస్తూ
, రాముని సహాయంతో తన అన్ననే చంపించటానికి ఒప్పందం చేసుకున్నా, తాను ఆశించినది జరిగినా అన్న మరణం తెచ్చిన దు:ఖ్ఖంతో.

లక్ష్మణ-హనుమలు: బాణాల కంటే వాడైనా వాలి మాటలు వింటూ ఆలోచనా ముద్రలో.














Wednesday, April 20, 2011

పురాణ బొమ్మలే కాదు!!

అద్భుత చిత్రకారుడు శ్రీ వడ్డాది పాపయ్య గారు ఒక్క పురాణ బొమ్మలు వెయ్యటానికే పరిమితం అవ్వలేదు సందర్భోచితంగా చందమామ ముఖ చిత్రాలుగా అప్పటి దేశ సమస్యలను పిల్లలకు తెలిసేట్టుగా చక్కగా చిత్రీకరించారు.

1962
దీపావళికి పాపయ్య గారు వేసిన చిత్రం చూడండి. అప్పుడే కమ్యూనిస్ట్ చైనా మన దేశం మీదకు దురాక్రమణ చేసింది. విషయాన్ని పరోక్షంగా చూపిస్తూ చిన్న పిల్ల వాణ్ని సైనిక దుస్తుల్లో చూపి దేశానికి సైనిక పాటవం ఎంతో అవసరం అని పిల్లలకు స్పురించేలా చక్కగా వేశారు.


అలాగే
జనవరి 1963 సంచిక చివరి పుట చిత్రంగా అద్భుతమైన బొమ్మ వేశారు. బారతీయుల దేశ భక్తి చూసి బిత్తరబోతున్న చైనాను కాళ్ళ జెర్రి లాగ , డ్రాగన్ లాగ వేశారు. అప్పట్లో ప్రజలు విరివిగా విరాళాలు ఇవ్వటం కూడా చక్కగా చూపారు బొమ్మలో, చూడండి.




కల నిజమాయెగా!

=======================================
చిన్ని వ్యాసం త్రివిక్రమ్ గారి బ్లాగ్ నుండి పున:ప్రచురణ
ప్రస్తుతానికి చందమామ సాఫ్ట్ కాపీలు చందమామ వారి వెబ్ సైటులో(క్లిక్ చెయ్యండి) తప్ప, (అతి తక్కువ రిజల్యూషన్ లో) మరెక్కడా అందుబాటులో లేవు. ఎక్కడన్నా ఎవరన్నా మంచి రిజల్యూషన్ లో ఉన్న పి డి ఎఫ్ ఫైళ్ళు వెబ్ సైట్లల్లో ఉంచితే చందమామ వారు వెతికి వెతికి వేటాడి అవి తీసేయిస్తున్నారు. అప్పట్లో యు లిబ్ నుండి డౌన్లోడ్ చేసుకోగలిగిన వారు అదృష్టవంతులు!!

ఇప్పటికీ అలనాటి తమ పాత ప్రతులను సాఫ్ట్ కాపీలను చదువరులకు అందిస్తున్న ఏకైక పత్రిక చందమామ. మరే ఇతర పత్రికకూ వారి పాత ప్రతులకు డిమాండూ లేదు, అలా తమ పత్రిక పాత ప్రతులను సాఫ్ట్ కాపీలను తమ వెబ్ సైట్లలో ఉంచే నిబద్ధతా లేదు.
=======================================

( ఆనందం 2006 డిసెంబరు నాటిది)
"కల నిజమాయెగా! కోరిక తీరెగా!!"

అని చందమామ అభిమానులు పరవశించి పాడుకునే రోజు ఎంతో దూరంలో లేదు. తి.తి.దే. వాళ్ళు పాత చందమామలను అమూల్య భారతీయ వారసత్వ సంపదగా గుర్తించి డిజిటలైజ్ చేస్తున్నరని తెలిసినప్పటినుంచి అవి మనకందుబాటులోకి వచ్చేది ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న నా లాంటివారికిది శుభవార్త. వీటిని జనవరి 23వ తేదీ తిరుపతిలో ఆవిష్కరించి, చందమామ సంపాదకులు విశ్వనాథరెడ్డికి అందజేస్తామని తి.తి.దే. వాళ్ళు తెలిపారు. ఇవి మార్కెట్లోకి వస్తే పాత చందమామలకోసం హైదరాబాదులోని పాతపుస్తకాల షాపుల్లో వెదకడం; హిందూ లో, ఇంటర్నెట్లో ప్రకటనలివ్వడం లాంటి అవస్థలు తప్పుతాయి. :) ఇది నిజంగానే మొన్న ౧౬వ తేదీ హిందూలో వచ్చిన ఒక ప్రకటన (పేజీ అడుగున ఉంది):
Chandamama

Interested in old/very old Chandamama (Telugu) magazines. If any body interested to gift/sell at reasonable price, contact K.S.Kumar, Ph.98666-96564.




(పాత చందమామలు ఒక అగ్నిప్రమాదంలో కాలిపోయాయట. వాళ్ళ ఆఫీసులో ప్రతి సంచికా ఒకటో రెండో ప్రతులు మాత్రమే ఉన్నట్లున్నాయి. అందుకే అవి కావాలనుకున్నవాళ్ళకు ఇన్ని తిప్పలు.)

ఈరోజు ఈనాడులో వచ్చిన వార్త:



సీడీల్లో 'చందమామ'
ముందుకొచ్చిన తితిదే
ఇప్పటికే లక్ష పేజీల నిక్షిప్తం
(60 యేళ్ల కాలంలో వచ్చిన తెలుగు చందమామలు దాదాపు 45 వేల పేజీలు ఉండవచ్చు)
చెన్నై - న్యూస్‌టుడే

తెలుగు వారి అభిమాన పుస్తకం.. ఆ కథల మాధుర్యానికి మురిసిపోని తెలుగు వారంటూ ఉండరు.. కేవలం ఒక్క తెలుగు వారినే కాకుండా 13 భాషల్లో అందరినీ ఆకట్టుకున్న గొప్ప పత్రిక చందమామ. ఇప్పుడు ఆ పుస్తకాలను డిజిటలైజ్‌ చేసి కంప్యూటర్లు, సీడీల్లో నిక్షిప్తం చేయడానికి తిరుమల-తిరుపతి దేవస్థానం ముందుకొచ్చింది. తిరుపతిలోని ఎస్వీ డిజిటల్‌ గ్రంథాలయంలో ఈ పనులు జోరుగా సాగుతున్నాయి. 13 భాషల్లో ఉన్న మూడు లక్షల పుస్తకాలను పూర్తిగా సీడీల్లోకి నిక్షిప్తం చేస్తామని ఆ గ్రంథాలయ డైరక్టర్‌ భూమన్‌ చెప్పారు. చెన్నైలో శనివారం ఆయన 'న్యూస్‌టుడే'తో మాట్లాడుతూ ఈ విషయం చెప్పారు. ఇప్పటికే లక్ష పేజీలను సీడీల్లో నిక్షిప్తం చేశామన్నారు. వీటిని జనవరి 23వ తేదీ తిరుపతిలో ఆవిష్కరించి, చందమామ సంపాదకులు విశ్వనాథరెడ్డికి అందజేస్తామన్నారు. చందమామ పత్రికలో వచ్చే కథలు ఎంతో విలువైనవని చెప్పారు. ఈ కథల కోసం అంతర్జాతీయంగా ఎన్నో ప్రముఖ ఛానెళ్లు డిమాండ్‌ చేస్తున్నాయని పేర్కొన్నారు. ఇందులో హనుమాన్‌ కథను సీడీల్లో నిక్షిప్తం చేయడానికి అనుమతిస్తే రూ. ఏడు కోట్లు చెల్లిస్తామని డిస్నీ ఛానెల్‌ చందమామ యాజమాన్యాన్ని కోరిందని.. వారు అందుకు తిరస్కరించి తమ విశిష్టతను చాటారని తెలిపారు.

Tuesday, April 19, 2011

చందమామ జ్ఞాపకాలు-2

క్రింది టపాలో ప్రస్తావించిన పద్మపాదుడు-పింగళుల కథ:ముగ్గురు మాంత్రికులు - నేను చిన్నప్పుడు చందమామ చదవడం మొదలుపెట్టినరోజుల్లో చందమామలో వస్తూండిన జానపద ధారావాహిక. దీనికి సమాంతరంగా నడిచిన పౌరాణిక ధారావాహిక వడ్డాది పాపయ్య రాసిన "విష్ణుకథ" (పోతన భాగవతానికి సంక్షిప్తరూపం). ఆరోజుల్లో బాలమిత్రలో గండభేరుండదీవి వస్తూ ఉండేది. ముగ్గురు మాంత్రికుల్లో కథానాయకుడైన పింగళుడు మాంత్రికుడు కాదు. అతడొక మామూలు జాలరి యువకుడు. అన్నదమ్ములైన ముగ్గురు మాంత్రికులు మహామాంత్రికుడైన మహామాయుడి సమాధిలోని అపూర్వ వస్తువులు - మంత్రదండం, మహిమగల ఉంగరం, బంగారుపిడిగల ఖడ్గం - సాధించుకుని రావడానికి ఒకరి తర్వాతొకరు బయలుదేరుతారు. వారిలో ఆఖరివాడైన పద్మపాదుడొక్కడే పింగళుడి సాయంతో అర్హతపరీక్షలో నెగ్గి ప్రాణాలతో బయటపడి చాణక్యుడి వలె తాను వెంట ఉండి ప్రణాళికలు వేసి సమయానికి తగిన సలహాలిస్తూ చంద్రగుప్తుడిలాంటి పింగళుణ్ణి మహామాయుడి సమాధిలోకి పంపుతాడు. సమాధి ఒక మహాసౌధం. మొదట అది నీళ్ళలో మునిగి ఉంటుంది. పద్మపాదుడు నీటిని ఇంకిపోయేలా చేసి దాన్ని బయటపడేస్తాడు. దానికి ఏడు ద్వారాలుంటాయి. ఒక్కో ద్వారం దగ్గరా తన మంత్రశక్తులతో మహామాయుడు సృష్టించుకున్న మాయలను పింగళుడు తన ధైర్యసాహసాలతో ఛేదించి సమాధిలోనికి ప్రవేశించి అపూర్వ వస్తువులను సంగ్రహించడం ప్రధాన కథ. మహామాయుడి శిష్యులు వీళ్ళను మహామాయుడి సమాధి వరకూ వెళ్ళనివ్వకుండా దారిలో తమ మాయలతో ఆటంకాలు కల్పించబోవడం, వీళ్ళు వాటిని ఛేదించుకుంటూ ముందుకు పోవడం, పనిలో పనిగా భల్లూకపర్వతాల్లో మహామాయుడిచేత బందీగా మారిన ఒక మాయావియైన రాక్షసుడొకణ్ణి (పేరు గుర్తురావడం లేదు...భల్లూకకేతుడా?) రక్షించడం, వాడు వారికి నమ్మకస్థుడుగా మారడం, తీరా ఇంటికొచ్చాక పింగళుడు దుర్మార్గులైన తన అన్నల మూలంగా మళ్ళీ కష్టాల పాలు కావడం, చివరికి క్లైమాక్సులో తన అన్నలకు, అహంకారియైన సేనానికి బుద్ధిచెప్పడం ( సన్నివేశం బాగా నవ్వు తెప్పిస్తుంది),...అలా సాగిపోతుంది కథ.

మామూలుగా మాంత్రికులంటే జడలు, గడ్డాలు, మీసాలు పెంచి, మంత్రదండం చేతబూని విచిత్ర వేషధారణతో ఉంటారని ఊహిస్తాం. (వాళ్ళ మంత్రశక్తి అంతా జడల్లోనో, మంత్రదండంలోనో ఉంటుందని ఒక నమ్మకం.) కానీ ఇందులో పద్మపాదుడు రకమైన జడలు, జులపాలు గానీ, కనీసం గడ్డం, మీసాలు కూడా లేకుండా, ఒంటిమీద కూడా కేవలం డ్రాయరూ, బనీనుతో తలమీదుండే కొద్ది జుట్టు కూడా కనిపించకుండా అంటుకుపోయే టోపీ పెట్టుకుని ఉంటాడు. ఆలోచన బొమ్మలేసిన చిత్రాదో, సంపాదకులదో లేక రచయితదో మరి?

Tuesday, April 12, 2011

ఈ బొమ్మను చూసి థ్రిల్లయిపోయాను!




           చందమామ జులై 1978 సంచికలో ‘భల్లూక మాంత్రికుడు’ సీరియల్   ప్రారంభ చిత్రం.                                                   (నాకు నచ్చిన బొమ్మ...  ఇది కాదు :-))


నాకు  చిత్రా, శంకర్ ల బొమ్మలు బాగా  ఇష్టమే కానీ, చందమామలో  మరో ఆర్టిస్టు  ‘జయ’ బొమ్మలు కూడా నచ్చేవి.‘చిత్రా’ బొమ్మల్లో కనిపించే  స్వేచ్ఛ గానీ, కదలిక గానీ వీటిలో  ఉండకపోవచ్చు గానీ,

 ఇవి ‘పద్ధతి’గా  ఉండేవి. కట్టడాలన్నీ స్కేలుతో గీసినట్టు  సౌష్ఠవంగా  కనిపించేవి. J అక్షరం  ఎడమవైపునున్న వంపును పైకి  గీసి,Jaya తన సంతకం చేయటం అందంగా తోచేది.

‘మాయా సరోవరం’బొమ్మలు గీయటం పూర్తిచేసి, చిత్రా అస్తమించాక  దాసరి సుబ్రహ్మణ్యం  గారి జానపద సీరియల్  ‘భల్లూక మాంత్రికుడు’ సీరియల్ కి  చిత్రకల్పన చేసే అవకాశం Jaya నే వరించింది. అప్పటికే చందమామలో  చాలా కథలకు తాను  వేసిన బొమ్మలతో జయ ప్రాచుర్యం పొందాడు.

అయితే  ఆ  సీరియల్ గానీ, ఆ బొమ్మలు గానీ నన్ను పూర్తిస్థాయిలో  ఆకట్టుకోలేకపోయాయి.

ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే... జయ కష్టపడి వేసినప్పటికీ  ఆ  బొమ్మలు  పాఠకులను అంతగా  ఆకర్షించలేదు. అప్రయత్నంగానో, సప్రయత్నంగానో చిత్రా బొమ్మలతో పోల్చిచూడటం వల్లనే  ఇలా జరిగిందనుకుంటాను.

 ఫలితంగా... ఈ సీరియల్ ముగియగానే చిత్రా బొమ్మలతో  రెండోసారి  ‘తోకచుక్క’ పొడవక తప్పలేదు.

అయితే...

‘భల్లూక మాంత్రికుడు’సీరియల్ కి జయ వేసిన  బొమ్మల్లో ఒక్కటి మాత్రం 30 ఏళ్ళుగా  నా స్మృతి పథంలో నిలిచిపోయింది. ఆర్టిస్టు చిత్రించిన  కోణం నన్నెంతో థ్రిల్ కు గురిచేసింది.‘ఎంత బాగా వేశాడు’ అనిపించింది.


ఆ బొమ్మ గురించి  అందరితో  పంచుకోవచ్చని రెండు రోజుల క్రితం తట్టింది. వెంటనే  ఆ బొమ్మ కోసం చందమామ వెబ్ సైట్లో  ఆర్కయివ్స్ లో వెతికాను.

కనపడింది!

మూడు  దశాబ్దాల తర్వాత...నాటి  నా  సంభ్రమాన్ని తలపోసుకుంటూ  చూశాను  మళ్ళీ!

అదొక్కటే కాదు; ఆ బొమ్మ కు పూర్వదశలు అనదగ్గ  మరో మూడు బొమ్మలు  కూడా ఆ సీరియల్లో   కనపడ్డాయి.ఈ బొమ్మలన్నిటినీ  వరుసగా  చూపిస్తే చాలా బాగుంటుందనిపించింది!

చూడండి... ఆ  చిత్రాలు!


మనం కొంత  ఎత్తులోనుంచే  చూస్తున్నాం  కదూ  కోటను.  (ఏప్రిల్ 1979).


ఏనుగుల్నీ, భల్లూకాన్నీ తర్వాత చూడొచ్చు; కోట సింహద్వారాన్ని గమనించండి.  మనం  మరి కాస్త ఎత్తు నుంచే  దీన్ని వీక్షిస్తున్నాం.  అవునా? (జూన్ 1979)



ఆర్టిస్టు జయ మనల్ని ఇంకొంచెం పైకి తీసుకువెళ్ళి ఈ కోటను చూపిస్తున్నాడు  (సెప్టెంబరు 1979).  బాగుంది కదా...  
   అందుకే,    తర్వాతి   నెలలో విహంగవీక్షణ చిత్రాన్ని  పతాక స్థాయికి తీసుకువెళ్ళాడు  జయ!
  



                               ఇదేనండీ... నన్ను మురిపించిన ఆ  బొమ్మ !  (అక్టోబరు 1979)

ఇంత ఎత్తు నుంచి చూపిస్తే-  చంద్రశిలా నగర ద్వారం వద్ద మాయా మర్కటుడు గానీ,అతణ్ణి అడ్డగిస్తున్న కాపలా భటులు గానీ మనకు  స్పష్టంగా  ఎలా కనపడతారు చెప్పండి!

కానీ అలా కనపడకుండా  విభిన్నమైన కోణంలో గీయటం వల్లనే కదా, ఈ చిత్రం ఇంతగా బాగుందీ!

Saturday, April 9, 2011

చిత్రా అద్భుత చిత్రీకరణ

శ్రీ చిత్రా
చందమామ అంటేనే బొమ్మలకు ప్రసిద్ది. కథ ఏదైనా సరే (కథలు గొప్పవి కావని కాదు!) బొమ్మల ఆకర్షణలో కథ చదవకుండానే అర్ధమయ్యే రీతిలో ఉండేవి బొమ్మలు అప్పట్లో. ముఖ్యంగా "చిత్రా" గారి బొమ్మలు. పాతాళ దుర్గం అని ఒక ధారావాహిక 1960 లలో వచ్చింది. ధారావాహికలోది , ఒక పూర్తి పుట చిత్రం కింద ఇస్తున్నాను. ఇది పాతాళ దుర్గం లోపలి బొమ్మ. చూడండి చిత్రాగారు ఎంత చిత్రంగా చిత్రించారో!! పాతాళంలో ఉన్నవాళ్ళకి లైటు ఎలా అనుకునే పిల్లలకి చక్కగా తెలిసేట్టుగా అక్కడక్కడా అంతర్ గుహా నిర్మాణం లో ఉన్న రంధ్రాల నుండి "స్కై లైట్" లాగ సూర్య కిరణాలుఎలా ప్రసరిస్తున్నాయో. చక్కటి "Light & Shade effect" బొమ్మ పరిపూర్ణంగాఉన్నది. స్వతహాగా చక్కటి ఫోటోగ్రాఫర్ ఐన చిత్రాగారు, తన బొమ్మల్ని కూడా ఫోటో తీసినట్టు వేసేవారు. ఇకచూడండి అద్భుత చిత్రం.


చందమామలోముద్రా రాక్షసం

అవునండీ చందమామలోనే, అదీ మన తెలుగు చందమామలోనే అప్పు తచ్చులు, అవే అచ్చు తప్పులు. ఆంగ్లంలో 'Printer's Devil' అనే మాటను మన పూర్వీకులు తెలుగులోకి అద్భుతంగా తర్జుమా చేశారు, ఏమనీ! "ముద్రా రాక్షసం" అని. ఇలా తెలుగు చెయ్యబడిన మాటలు హాయిగా ఉంటాయి అంతర్జాలం (ఏదో మార్జాలం లాగ ) లాంటి మాటలు కాకుండా.

సరే విషయానికి వస్తే ఆగష్టు 1967 సంచికలో "భారత చరిత్ర" ధారావాహిక మకుట చిత్రం లో ఉన్నదా తప్పు. నెలలో తప్పుతో ఉన్న బొమ్మని మరుసటి నెలలో సవ్యంగా ఉన్న బొమ్మనీ రెండిటినీ కింది ఇస్తున్నాను, చూడండి. ఎంత చందమామలోనైనా దేశ పటం ముద్రణలో ఇలాటి తప్పు చాలా ఘోరం.